Nalgonda Nakili Pathi vithanalu: నకిలీ విత్తనాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నల్గొండ జిల్లా ఎస్పీ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించి అక్రమార్కుల ఆటకట్టిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1 కోటి 80 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 


నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ. డి.సైదా బాబు, ఎస్ఐ విజయ్ కుమార్, ఎస్ఐ ఈ.రవి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులు భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న గ్యాంగ్ ఆట కట్టించారు. దీనికి సంబంధించి నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో Cr.No.104/2023 U/s 120 (B),420, 486  r/w 34 IPC Sce 19 లతో పాటు విత్తన చట్టం సెక్షన్ 15(1) కింద కేసు నమోదు చేశారు. ముగ్గుర్ని అరెస్ట్ చేయగా, వారి వద్ద నుంచి 1 కోట్ల  ఏనబై  లక్షల  విలువ చేసే (10 వేల కిలోలు) 200 బస్తాల విడి విత్తనాలు ఒక్కొకటి (50 కిలోలు), ఒక ఎర్టిగా Car No AP 39 BP 6345 వాహనంతో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు పోలీసులు.
అల్వాల్ హిల్స్, సికింద్రాబాద్ కు చెందిన గోరంట్ల నాగార్జున, ఏపీలోని పల్నాడు (జిల్లా) పెద్దకూరపాడు మండలం  గారెంపాడు గ్రామానికి చెందిన గడ్డం రవీంద్రబాబు, నంద్యాల జిల్లా గోసపాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన మెరిగే వేణులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన నరసింహ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. 
నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయని పక్కా సమాచారంతో నార్కట్ పల్లి ఎస్ఐ, సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, నార్కట్ పల్లి ఫ్లై ఓవర్  వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించడంతో ఎర్టిగా కార్ నం. AP 39 BP 6345 గల వాహనాన్ని  ఆపి తనిఖీ చేయగా, అందులో పత్తి విత్తనాలున్నాయి. వ్యవసాయ అధికారులను పిలిపించి చెక్ చేయగా అవి నకిలీ పత్తి విత్తనాలు అని తేలింది. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వీరు కర్ణాటక రాష్ట్రంలో కొంత మంది రైతుల దగ్గర నుండి పత్తి విత్తనాలు తక్కువ దరకు కొనుగోలు చేసి గుంటూరు జిల్లా  దాచపల్లి దగ్గర స్టోరేజ్ చేస్తున్నామని చెప్పారు. అక్కడ నుండి మహారాష్ట్రలోని నాగపూర్ కి  చెందిన  రైతులకు ఎక్కువ ధరకు విక్రయించడానికి తరలిస్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని రిమాండుకి తరలించారు. హెర్బి సైడ్ టలారెన్స్  పత్తివిత్తనాలను GEAC నిషేధించింది. వీటి వినియోగంతో వాతావరణ కాలుష్యం జరుగుతుందని వీటిని వాడవద్దని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచించారు.


నిందితులపై పీడీ యాక్ట్‌.. జిల్లా ఎస్పీ
ఈ తరహా రైతులను మోసం చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, నకిలీ విత్తనాలు అమ్మినా, సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పి.డీ. యాక్ట్ పెడతామని జిల్లా ఎస్పీ కె అపూర్వ రావు హెచ్చరించారు.


రైతులకు విజ్ఞప్తి : 
రైతులు నకిలీ విత్తనాల ముఠాల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. తక్కువ ధరలకే విత్తనాలు విక్రయించే వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. నల్లగొండ  పోలీసు మరియు వ్యవసాయశాఖ బృందాలు వీటి గురించి.. అన్నదాతలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠాలపై నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. లైసెన్స్ దారులు అమ్మే విత్తనాల ప్యాకెట్ మీద పూర్తి వివరాలు ఉంటాయి. రైతులు విత్తనాలు కొనేటప్పుడు వీటిని గమనించాలి. ఇలాంటి వాటి పట్ల అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలన్నారు.