Nagarjuna Sagar: ప్రపంచంలోనే అతిపెద్దది అయిన మానవ కట్టడం, అలాగే అతిపొడవైన రాతి కట్టడం నాగార్జున సాగర్. రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను సస్యశ్యామలంగా మార్చిన ఈ ప్రాజెక్టు నేటితో 56 ఏళ్లు పూర్తి చేసుకుంది. సరిగ్గా 56 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టును అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జాతికి అంకితం చేశారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చేందుకు ఈ ప్రాజెక్టు అవసరం అని భావించా... కృష్ణానదిపై నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంతటి అపురూపమైన ఈ ప్రాజెక్టుకు 68 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10వ తేదీన నాగార్జున సాగర్ వద్ద శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి రోజుకు 45 వేల మంది 12 ఏళ్ల పాటు శ్రమించి ఈ ప్రాజెక్టును నిర్మించారు. 


మొత్తం 19 కోట్ల 71 లక్షల మంది కార్మికులు ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు కృషి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మితమైన ఈ అద్భుత కట్టడాన్ని ఆవిష్కరించారు. దీన్ని 1964లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కాలువలకు నీటిని విడుదల చేసి జాతికి అంకితం ఇచ్చారు. 1955 డిసెంబర్ 10వ తేదీన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. అయితే 12 ఏళ్ల తర్వాత ఆయన కూతురే స్వయంగా నీటిని విడుదల చేయడం గమనార్హం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు సాగునీరు వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా కుడి ఎడమ కాలువల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలు సాగు అవుతోంది. 
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ఋణంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులను చేపట్టింది. 2010  ఆగస్టు 14వ తేదిన ప్రపంచ బ్యాంకుతో దీనిపై ఒప్పందం కుదిర్చుకుంది. సెప్టెంబర్ 10వ తేదీ 2010 నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకం అంచనా వ్యయం రూ.4444.41 కోట్లు. ఇందులో 48 శాతం ప్రపంచ బ్యాంకు ఋణం. రాష్ట్ర ప్రభుత్వం వాటా 52 శాతం. ఒప్పందానికి సంవత్సరం ముందు నుంచి నిబంధనలకు లోబడి జరిగిన వ్యయంలో ప్రపంచ బ్యాంకు ఋణం వాటా రిట్రోఏక్టివ్ ఫడింగ్ ద్వారా చెల్లిస్తుంది.


ఆధునీకరణ లక్ష్యాలు


నాగార్జున సాగర్ కాలువలను ఆధునీకరించి నీటి సరఫరా సామర్ధ్యాన్ని వృధ్ది చేస్తూ వ్యవసాయాభివృధ్ధి చేయుట,వ్యవసాయ ఉత్పాదకత పెంచడం. నీటిపారుదల ఆయకట్ట అభివృధ్ది శాఖ సామర్ధ్యాన్ని పెంపుచేసి జలవనరులను బహుముఖంగా, ప్రణాళికా బధ్ధంగా జలవనరులను అభివృధ్ది చేసి నిర్వహించడం. ఈ పథకం గరిష్ఠ లక్ష్యాలతో కూడుకుంది. ఈ పథకాన్ని ప్రధానంగా సాగునీరు ఆయకట్టు అభివృధ్ది శాఖ అమలు చేస్తుంది. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలు ఈ పథకం అమలులో పాలు పంచుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖలకు తోడు వాలంతారి, ఆచార్యఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సామేతి వంటి సంస్దలు ఈ పధకం అమలులో భాగస్వాములు అయ్యాయి. అయితే 2018లో రెండు సంవత్సరాల ఆలస్యంగా ఈ పథకం పూర్తయింది.


ఈ ప్రాజెక్టు వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిరులు పండించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు వల్లే అన్నం మెతుకులు తింటున్నామని దేశానికి అన్నం పెడుతున్నామని ఆయక్టు రైతులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును ఆయుకట్టు రైతులు దేవాలయంగా భావిస్తుంటారు. ఈసారి కూడా రాష్ట్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ఈ ఏడాదికి కూడా ఆగస్టులోనే నీటిని విడుదల చేయవచ్చని రైతులు భావిస్తున్నారు.