రాష్ట్రం నిరుపేదల అవసరాలు తెలిసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేటలోని సుందరయ్య నగర్‌లో ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు వేసుకున్న 95 మంది పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. 


అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు జీవో 58 ఒక వరం అని అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ ప‌థ‌కాలు ప్రతి నిరుపేద‌కు అందించామ‌ని మంత్రి తెలిపారు. ఇళ్లు లేని వారు ఎన్నోఏండ్ల నుంచి అభద్రతా భావంతో ఉంటున్నార‌ని తెలిపారు. సుందరయ్య నగర్ ప్రజల ఇరవై ఏండ్ల కల ఈ రోజు నెరవేరిందని మంత్రి వ్యాఖ్యానించారు. మీ కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పేదవాళ్లు ఎన్నో ఏళ్లుగా ఏ హక్కు లేకుండా జీవించడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారనే విషయం మఖ్యమంత్రి కేసిఆర్ తెలుసుకొని ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చూట్టారని తెలిపారు.


పేదలకు సొంత నివాసాల పేరుతో ఇండ్లు నిర్మించి, వారి పేరుతో బ్యాంకుల్లో అప్పులు మోపిన చరిత్ర గత పాలకులది విమర్శించారు. 4 వేల కోట్లు రుణ మాఫీ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలకు మహిళలు, పేదలే కేంద్రబిందువు అన్నారు. మహిళలు, పేదలు బాగుంటేనే తెలంగాణ సార్థకమైనట్లు అని నమ్మే నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. అనంతరం ఇండ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.


దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత పాలకులు ఇల్లు లేని పేదలను పట్టించుకోలేదని విమర్శించారు. వారు కేవలం ఓటు రాజకీయాలు మాత్రమే చేశారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడితే... ప్రతిపక్షాలకు అవి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.


పేదల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని. కళ్లకు కనబడే అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీలు కళ్ళు తెరవాలని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేదవారికి బీఆర్ఎస్ పార్టీ దగ్గరయిందని  చెప్పారు. రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేస్తున్న కానీ కాంగ్రెస్ పార్టీకి, బిజెపి పార్టీకి నచ్చడం లేదని ఎద్దేవా చేశారు.  దేశంలోని కాంగ్రెస్, బిజెపి పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఇళ్లను ఇవ్వడం లేదని విమర్శించారు. కానీ తెలంగాణలో మాత్రం పేదలకు ఇల్లు ఇస్తే ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని స్పష్టం చేశారు.


ప్రతిపక్షాలు ఇకనైనా తమ ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని కోరారు. మరో విడతలో 45మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, కౌన్సిలర్ మాలోతు కమల, తదితరులు పాల్గొన్నారు.