Rahul Gandhi Warangal Tour: వరంగల్‌లో నేడు రాహుల్ గాంధీ హాజరు కానున్న సభకు కాంగ్రెస్ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకాబోరని ప్రచారం జరుగుతుండడంపై స్వయంగా ఆయనే స్పందించారు. ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను రాహుల్ గాంధీ సభకు హాజరవుతానని స్పష్టం చేశారు. అంతేకాక, తాను 2 వేల వాహనాలతో ర్యాలీగా సభకు భారీ ఎత్తున జనంతో హాజరవుతున్నట్లుగా చెప్పారు.


కొద్ది రోజుల క్రితం మళ్లీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డితో విభేదాలు వచ్చినట్లు వ్యవహరించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్ పర్యటనలో భాగంగా జిల్లా నేతలో సమావేశం అవసరం లేదని కోమటిరెడ్డి తేల్చి చెప్పారు. నిజామాబాద్ వంటి జిల్లాలపై రేవంత్ దృష్టి పెట్టాలని, నల్గొండ జిల్లాలో తనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని, ఇక్కడ కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని చెప్పారు. ఆ ప్రకారం ఆయన రేవంత్ సమావేశానికి హాజరు కూడా కాలేదు. దీంతో అంతకుముందు కలిసిపోయినట్లుగా కనిపించిన వీరి మధ్య మళ్లీ విభేదాలు ఉన్నట్లు తెరపైకి వచ్చాయి.


ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ సభకు హాజరు కారేమో అనే ప్రచారం జరిగింది. కొద్దిరోజుల క్రితం క్యారెక్టర్ లేని వాళ్ల దగ్గర పని చేయలేనంటూ తన నియోజకవర్గ నేతలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా.. మీ అందరికీ చెప్పే తీసుకుంటానని అన్నారు. ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు. నేటి రాహుల్ గాంధీ సభకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరవుతున్నట్లు ప్రకటించిన వేళ, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.


తొలుత సీఎల్పీ పదవి ఆశించిన రాజ్‌గోపాల్ రెడ్డి ఆ పదవి దక్కకపోవడంతో అప్పటి నుంచి అసంతృప్తి చెందారు. కొంత కాలం క్రితం రాజగోపాల్ రెడ్డి బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేయడంతో ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. ఇప్పుడు రాహుల్‌ సభకు కూడా దూరంగా ఉండడంతో బీజేపీలో చేరుతారనే నమ్మకాలు బలపడుతున్నాయి.


నేటి సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు Rahul Gandhi.. 
ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరిన రాహుల్ గాంధీ శుక్రవారం సాయంత్రం 4:50కి శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు. 5:10కి శంషాబాద్ ఏయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన నేరుగా వరంగల్ బయలుదేరుతారు. వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకున్నాక సాయంత్రం 6:05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభ (Congress MP Rahul Gandhi to address public meet in Warangal)లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. సభ పూర్తయ్యాక తిరిగి వరంగల్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాత్రి  10:40కు హైదరాబాద్ చేరుకుంటారు రాహుల్ గాంధీ. శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో ఆయన స్టే చేయనున్నారు. 


తెలంగాణలో రెండో రోజు పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ శనివారం మధ్యాహ్నం 12:30కి హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు. దివంగత మాజీ సీఎం సంజీవయ్యకు రాహుల్ నివాళులు అర్పిస్తారు. అనంతరం సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్ గాంధీ భవన్‌కు చేరుకుంటారు.


గాంధీ భవన్‌లో పార్టీ special extended మీటింగ్‌లో మధ్యాహ్నం 2:45 వరకు పాల్గొంటారు. ఆ తరువాత మెంబర్ షిప్ కో ఆర్డినేటర్లతో ఫొటో సెషన్ లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ ఏయిర్ పోర్ట్ చేరుకుంటారు. శనివారం సాయంత్రం 5:50కి శంషాబాద్ ఏయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ ఢిల్లీ వెళ్లిపోతారు.