ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు పార్టీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుందా..? ప్రస్తుత చర్యలు చూస్తే ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. గెలించేందుకు అవసరవైన బలం ఉన్నా తమ ఓటర్లను క్యాంపునకు తరలించడంతోపాటు అక్కడికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైతం వెళ్లడం తమ ఓటర్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారనే అనుమానంతోనే అని కొందరు పేర్కొంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి ఆది నుంచి వర్గపోరు తప్పడం లేదు. పార్టీలో ఇబ్బడి ముబ్బడి చేరిన వలసల పుణ్యమా అని వర్గపోరును మరింత పెద్దదిగా చేసింది. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లోకి రావడం, అప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకున్న వారికి ప్రాధాన్యత తగ్గించడంతో తమ సత్తాను చాటేందుకు అసంతృప్తి నేతలు అదను కోసం వేచి చూస్తున్నారనే విషయం విధితమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సారథ్యంలో బుజ్జగింపుల పర్వం కొనసాగించగా కొంత మేరకు అవి సఫలీకృతం అయ్యాయని భావించారు.
క్యాంపుకు తరలించినా..?
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 769 ఓట్లు ఉండగా అందులో టీఆర్‌ఎస్ పార్టీకి అధికారికంగా 497 ఓట్లు ఉండగా ఇప్పటికే చాలా మంది వలసలతో పూర్తి బలంతో ఉంది. టీడీపీకి చెందిన 19, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన 75 మంది టీఆర్‌ఎస్ పార్టీలోనే చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌పార్టీకి సరాసరిగా 600 వరకు ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. అయితే, అంతర్గతంగా ఉన్న వర్గపోరు కారణంగా ఓటర్లు చేజారిపోకుండా వారిని గోవా క్యాంపునకు తరలించారు. అయితే, క్యాంపుకు ఏకంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెళ్లేందుకు సిద్దపడటం కేవలం క్రాస్ ఓటింగ్‌కు తమ ఓటర్లు పాల్పడతారనే ఉద్దేశ్యంతోనే అని పలువురు రాజకీయ విమర్శకులు పేర్కొంటున్నారు.
దీంతోపాటు జిల్లాలో బలంగా ఉన్న తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పట్టించుకోకుండా ఉండటంతో ఆ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా ఉండేందుకు క్యాంప్‌కు ఏకంగా మంత్రి పువ్వాడ అజయ్ వెళ్లాడని తెలుస్తోంది. దీంతోపాటు మాజీ ఎమ్మెల్యేలైన బానోత్ మదన్‌లాల్, పాయం వెంకటేశ్వర్లు సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఈ ఎమ్మెల్యేలకు చెందిన ఓటర్లు సైతం క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారనే అనుమానం నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా మంత్రి పువ్వాడ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కారు పార్టీలోని వర్గపోరు ఇప్పుడు పెద్ద నాయకులకు మాత్రం తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి