Kalvakuntla Kavitha : కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గట్టి హెచ్చరిక జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత.. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం తమ బీఆర్ఎస్ పార్టీ అని, తమ పార్టీ కార్యాలయాలపై, ఇళ్లపై దాడులుకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా.. జాగ్రత్తగా ఉండండి, ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా పార్టీ కార్యకర్తలు ఊరుకోరు అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రౌడీ మూకలతో ఇతరుల పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి తమది కాదని చెప్పారు.
కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టు
మూసీ మురికిమయం కావడానికి కారకులు ఎవరో ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలని కవిత చెప్పారు. రాష్ట్రాన్ని 60ఏళ్లు పాలించిన పారిశ్రామిక వ్యర్ధాలు మూసీలో కలుస్తుంటే కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. హైదరాబాద్ కు దగ్గర్లో ఉన్న కొండపోచమ్మ సాగర్ ను వదిలేసి దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి మూసీ - గోదావరి అనుసంధానం చేస్తామని ప్రభుత్వం అనడం సరికాదన్నారు. మూసీని కాంగ్రెస్ నాయకులు ఏటీఎంగా మార్చుకోవాలని చూస్తున్నారని కవిత ఆరోపించారు. కాంట్రాక్టర్ల కోసమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోందన్నారు. అందులో భాగంగానే అనుసంధాన ప్రాజెక్టు వ్యయాన్ని రూ.7,500 కోట్లకు పెంచారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
కొండపోచమ్మ నుంచి మూసీ అనుసంధానం చేసే ఆస్కారం ఉన్నప్పటికీ ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకని అడిగారు. ఈ విషయంపై నల్లగొండ జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీలో మురుగునీటి శుద్ధి కోసం 31 ఎస్టీపీలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న కవిత.. మూసీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అప్పట్లోనే ప్రణాళికలు రూపొందించారని గుర్తు చేసుకున్నారు.
ఆ పనులను వెంటనే పూర్తి చేయాలి
మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలపైకి ఇళ్లపైకి బుల్డోజర్లను పంపి, కూల్చివేస్తోందని కవిత ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు అయ్యే వ్యయాన్ని మొదట్లో రూ.50 వేల కోట్లు అని, ఆ తర్వాత రూ. 1లక్ష కోట్లు, మరోసారి లక్షన్నర కోట్లు అని సీఎం చెబుతూ.. మూసీని ఏటీఎంగా మార్చుకొని ఆ డబ్బును ఢిల్లీకి పంపించే ప్రణాళిక చేస్తున్నారని చెప్పారు. మరోపక్క యాదాద్రిలో కేసీఆర్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలన్న కవిత.. యాదాద్రి వైభవాన్ని ప్రభుత్వం కాపాడాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని, అందులో భాగంగానే మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేశారని చెప్పారు. ఫ్లోరైడ్ ని నిర్మూలించిన ఘనత కేసీఆర్ దేనని, ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్క వాటర్ ప్లాంట్ పెట్టిన పాపాన కూడా పోలేదని ఆరోపించారు.
Also Read : KTR: ‘పేరుకే ప్రజాపాలన కానీ దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు.. కాంగ్రెస్‌పై మండిపడ్డ కేటీఆర్