Telangana TET 2024 December: తెలంగాణలో జనవరి 2న ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET)) ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2 నుంచి జనవరి 20 వరకు పరీక్షలు నిర్వహించారు. టెట్ పరీక్షలకు సంబంధించి పేపర్-1, 2 కలిపి మొత్తం 2.75 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,05,278 మంది (74.44 శాతం) పరీక్షలకు  హాజరయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్ ఛైర్మన్ ఈవీ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలను జనవరి 24న విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులు జనవరి 24 నుంచి 27న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ లింక్ ద్వారా అభ్యంతరాలు నమోదుచేయవచ్చని ఆయన సూచించారు. 


డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే?
రాష్ట్రంలో టెట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ గురించి అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రతీ సంవత్సరం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. అందుకనుగుణంగా ఏటా రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి గత ఆగస్టులోనే ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్(2024-25 సంవత్సరానికి) విడుదల చేసింది. ప్రకటించిన ప్రకారం.. 2024లో రెండోసారి టెట్ పరీక్ష (TET December 2024) నిర్వహించింది. క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ 2025  విడుదల చేయనున్నారు. డీఎస్సీ పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 


ఎస్సీ వర్గీకరణపై పీఠముడి..
ఎస్సీ వర్గీకరణ వల్ల డీఎస్సీ నోటిఫికేషన్‌‌ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరి ఫిబ్రవరిలోపు ఈ అంశంపై స్పష్టం వస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. అయితే వర్గీకరణపై స్పష్టత రాకున్నా నోటిఫికేషన్ జారీ చేస్తారా..? అన్నది తెలియడం లేదు. విద్యాశాఖ వర్గాలు మాత్రం ఆ విషయం తేలే వరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వచ్చే డీఎస్సీలో సుమారు 6 వేల పోస్టులు భర్తీ చేస్తామని పలుమార్లు ప్రకటించింది. 


గత డీఎస్సీలో 10 వేలకు పైగా పోస్టుల భర్తీ..
తెలంగాణలో గత డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరి 29న 'డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో 6,508 ఎన్జీటీ పోస్టులు, 2,629 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీలు పోస్టులు, స్పెషల్‌ కేటగిరీలో 220 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు ,796 పోస్టులు ఎస్జీటీలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేస్తే 2,45,263 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఎక్కువ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు పోటీ పడుతున్నారు. ఈ పరీక్షకు 92.10 శాతం మంది హాజరయ్యారు. డీఎస్సీ ఫలితాల ఆధారంగా 10 వేలకు పైగా కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల ఇంకా 1056 స్పెషల్ ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టులు భర్తీ కాలేదని విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది నోటిఫికేషన్‌లో భర్తీచేసే పోస్టులపై విద్యాశాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..