Trump Sworn In As 47th President Of US: వాషింగ్టన్ డీసీ: 'అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా ప్రకటించిన ట్రంప్, దక్షిణ సరిహద్దులో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తాం అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలి ప్రసంగంలో ట్రంప్ కీలక ప్రకటనలు చేశారు. మార్స్ మీద అమెరికా జెండా మోపుతాం, ప్రపంచ దేశాలకు అమెరికా మార్గదర్శకంగా నిలుపుతాం అన్నారు. జనవరి 20, 2025 అమెరికాకు విముక్తి దినం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ భూభాగం విస్తరణకు చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
అంతకుముందు అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్‌లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అతిథుల సమక్షంలో సోమవారం రాత్రి 10:30 గంటలకు అమెరికా అధ్యక్ష బాధ్యతలు ట్రంప్ స్వీకరించారు. ఆయన కంటే ముందుగా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ (JD Vans) బాధ్యతలు స్వీకరించారు.
డొనాల్డ్ ట్రంప్ మొదటి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు ఇవే..
- అమెరికాలో స్వర్ణయుగం ఇప్పుడే మొదలైంది. ఇకనుంచి మన దేశం అభివృద్ధి చెందడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం మరింత పెరుగుతంది
- అమెరికా దక్షిణ సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితి (National Emergency)ని ప్రకటిస్తాం. అక్రమ వలసల్ని అక్కడే నిలిపివేస్తాం. అక్రమంగా వలస వచ్చిన వారిని వారి స్వస్థలాలకు తిప్పి పంపేస్తాం. మా 'మెక్సికోలోనే ఉండండి' విధానాన్ని తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నాం
- నా చివరిశ్వాస వరకూ మీ కోసం పోరాడుతాను. మన పిల్లలకు పటిష్ట, సుస్థిరమైన అమెరికాను అందించేందుకు కృషి చేస్తాను. అప్పుడు అమెరికాలో స్వర్ణయుగం కొనసాగుతుంది
- అమెరికా వ్యోమగాములను అంగారక గ్రహం (MARS)పైకి పంపాలనుకుంటున్నా. మార్స్ మీద అమెరికా జెండా పాతి తీరుతామని నమ్మకం ఉంది.
- పారిస్ వాతావరణ ఒప్పందం నుండి అమెరికా వైదొలగుతుంది
- దేశంలో ఈరోజు నుంచి పురుషులు, స్త్రీలు అనే రెండు జెండర్స్ మాత్రమే ఉండటం అమెరికా ప్రభుత్వ అధికారిక విధానం అన్నారు ట్రంప్.
- అమెరికన్ నౌకలపై అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అందులో అమెరికా నేవీ కూడా ఉందన్నారు. ముఖ్యంగా, పనామా కాలువను చైనా నిర్వహిస్తోంది. చైనా నుంచి పనామా కాలువ తిరిగి తీసుకుంటాం.
- అమెరికాలో ధరలను తగ్గించడంపై ఫోకస్ చేస్తాం. అమెరికా "జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి"ని ప్రకటించేందుకు నిర్ణయం.
ట్రంప్ ప్రమాణ స్వీకార వేడుకకు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, ప్రత్యేక ఆహ్వానంతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు హాజరయ్యారు. పలు దేశాల అధినేతలతో పాటు టెక్ దిగ్గజాలు, కుబేరులు జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, టిమ్ కుక్, మార్క్ జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్, తదితర ప్రముఖులు హాజరయ్యారు.