Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు- సీసీటీవీ వీడియో వైరల్
Earthquake In Taiwan: దక్షిణ తైవాన్‌లో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. పలుమార్లు భూమి కంపించడంతో యుజింగ్ జిల్లా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. యుజింగ్ జిల్లాలో సోమవారం రాత్రి పలుమార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్నిచోట్ల ఇండ్లు కూలిపోగా, వంతెనలు డ్యామేజ్ అయ్యాయని అధికారిక సమాచారం.
దక్షిణ తైవాన్‌లో సోమవారం రాత్రి మొదట 5.1 తీవ్రతతో యుజింగ్ జిల్లాలోని తైనన్ కు 4 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. ఆపై అదే ప్రాంతంలో 4.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. అర్ధరాత్రి దాటాక 6.4 తీవ్రతతో భూకంపం సంభవించగా.. కొన్నిచోట్ల ఇండ్లు కూలిపోయాయి. భూకంపం సంభవించడంతో 27 మంది వరకు గాయపడ్డారని దక్షిణ తైవాన్ అధికారులు వెల్లడించారు.
చియాయి కౌంటీలోని దాపు టౌన్‌షిప్‌లో భూకంపం కేంద్రం గుర్తించారు. ఇది 9.4 కిలోమీటర్ల లోతులో ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 అని అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. దక్షిణ తైవాన్‌లోని యుజింగ్ జిల్లాకు ఉత్తరాన 12 కి.మీ దూరంలో అర్ధరాత్రి 12:17 గంటలకు సంభవించిన ఈ భూకంపం ప్రభావంతో రాజధాని తైపీలో సైతం భవనాలు కంపించాయి. నాన్క్సీ జిల్లాలో ఓ ఇల్లు కూలిపోగా, అందులో చిక్కుకున్న ఓ చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులను రెస్క్యూ సిబ్బంది రక్షించినట్లు ఏఎఫ్‌పీ తెలిపింది.