Godavari Floods: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  భద్రాచలం గోదావరి నది వద్ద వరద ఉధృతిని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఎగువ నుండి గోదావరికి భారీగా వరద నీరు రావడంతో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుందని, రాగల 24గంటల్లో ప్రవాహం తగ్గి నిలకడగా మారుతుందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గోదావరికి ప్రత్యేక పూజలు చేసి, నది హారతినీ ఇచ్చారు. CCLA డైరెక్టర్ రజత్ కుమార్ షైనీ, సింగరేణి CMD శ్రీధర్, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పి వినీత్ తదితరులు ఉన్నారు.


కొనసాగుతున్న వరద సహాయక చర్యల్లో మంత్రి పువ్వాడ..
వారం రోజులపాటు కురిసిన వర్షాలకు గోదావరికి వరద పెరిగింది. అధికారులు అప్రమత్తమై నీటిని దిగువకు విడుదల చేసినా భద్రాచలం వద్ద నీటి ప్రవాహం పెరిగింది తప్ప అంతగా తగ్గలేదు. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడూ పరిశీలించి, లోతట్టు ప్రజలను అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భద్రాచలం సమీప ప్రాంతాల్లో వరద ముంపుకు గురి అయిన ప్రాంతాల్లో శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పర్యటించారు. కొనసాగుతున్న సహాయక చర్యల్లో పాల్గోని బాధితులకు ధైర్యం చెప్పి, పునరావాస కేంద్రంలోకి వెళ్ళాలని కోరారు. పునరావాస కేంద్రాల్లోఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వారికి వివరించారు. 


భద్రాచలం - చర్ల ప్రధాన రహదారిపై వరద నీరు చేరి పూర్తిగా రాకపోకలు స్తంభించిన  ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. అటుగా ఎవరి వెళ్లకుండా పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించాలని జిల్లా ఎస్పీ వినీత్ ను అదేశించారు. దీనితో పాటు ఏటపాక వద్ద రక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని సైనిక అధికారులకు సూచనలు చేశారు. అనంతరం గోదావరి నది వరద బాధితుల కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి పువ్వాడ సందర్శించారు. వారిని కలిసి మాట్లాడారు. అక్కడ అందుతున్న సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.


కాస్త తగ్గిన నీటిమట్టం..
ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రూపం దాల్చింది. శుక్రవారం నాడు దాదాపు 3 దశాబ్దాలకు గరిష్ట నీటి స్థాయికి చేరుకోవడంతో అధికారులు స్థానికులను, లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సైతం నిలిపివేశారు. నిన్న రాత్రి 70.50 అడుగులకు చేరుకున్న నీటి మట్టం నేటి ఉదయం కాస్త తగ్గింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70.20 అడుగులకు తగ్గింది. భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రత్యేక పూజలు చేసి, గోదారమ్మకు హారతి ఇచ్చారు. నది స్నానఘట్టాల వద్ద వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులతో కలిసి గోదారమ్మకు మంత్రి హారతులు ఇచ్చి, ప్రవాహం తగ్గాలని శాంతించాలని గోదారమ్మను ప్రార్థించారు. 
Also Read: Godavari Floods: గోదారమ్మా శాంతించు - మంత్రి పువ్వాడ నది హారతి, పూజలు