గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన 104 సంచార వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. మారుమూల ప్రాంతాల్లో వ్యాధులతో బాధపడుతు ఆసుపత్రులకు వెళ్లలేని వారికి సేవలందించేందుకు ప్రభుత్వం 104 వాహనాలను ఏర్పాటు చేసింది. ఈ వాహనంలో వైద్యుడితోపాటు ఏఎన్‌ఎం, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నిషియన్, మెడికల్ అసిస్టెంట్ విధులు నిర్వహించేవారు. గ్రామానికి ప్రతి 20 రోజులకోకసారి వెళ్లి వైద్య సేవలందించేందుకు 104 వాహనాలను వినియోగించారు. ఇటీవల నాన్ కమ్యూనికల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) ప్రోగ్రాం ద్వారా ఇంటింటికి తిరిగి బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందులు ఇస్తున్నారు. అయితే పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే 104 వాహనాలను తీసివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 104 సేవలను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
నిధుల కొరతతో వాహనాలను నడపలేక..
గ్రామాలలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సేవలందించేందుకు ఏర్పాటు చేసిన 104 వాహనాలు కొంత కాలంగా నిధులు కేటాయింపుల్లో నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోతున్నాయి. ప్రతి 20 రోజులకు ప్రతి గ్రామంలోకి వెళ్లి వైద్య పరీక్షలు చేయాల్సి ఉనప్పటికీ నిధులు లేక పోవడంతో డీజీల్ భారం భరించలేక 104 వాహనాలు ఆగిపోతున్నాయి. దీంతోపాటు 104లో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలలకోసారి వేతనాలు చెల్లిస్తున్నారు. దీని వల్లసిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం పల్లె దవాఖాలను ఏర్పాటు చేయాలని భావించిన నేపథ్యంలో వాహనాల అవసరం లేదని నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగులకు ప్రత్యామ్నయ కేటాయింపులు..
ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 23 104 సర్వీసులు ఉండగా 155 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 11 వాహనాలకు 86 మంది సిబ్బంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12 వాహనాలకు 69 మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 104 వాహనాలను నిలిపివేయాలని భావించిన నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు సర్దుబాటు చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. స్టేట్ హెల్త్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ తిరుపతయ్యను ఉద్యోగుల సర్దుబాటు కోసం నియమించింది. ఆయన నేతృత్వంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యశాఖ అధికారులతో సమావేశమై ఉద్యోగుల వివరాలు సేకరించారు. దీంతోపాటు ప్రస్తుతం పనిచేస్తున్న వారిని ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలనే అంశంపై నివేదికలు తయారు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 12 సంవత్సరాలపాటు గ్రామాలలో సేవలందించిన 104 వాహనాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కనుమరుగుకానున్నాయి.
Also Read: AP Employees Division : ఏపీ ఉద్యోగసంఘాల మధ్య చీలిక.. ప్రభుత్వంపై నమ్మకం ఉందంటున్న కొన్ని సంఘాలు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి