తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ మైకులన్నీ మూగబోయిన సంగతి తెలిసిందే. ప్రచారం గడువు ముగిసినా ఇంకా ప్రధాన పార్టీల వ్యూహాలు మాత్రం తగ్గలేదు. ఒకరిని మరొకరు డీగ్రేడ్ చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసుకుంటున్నారు. గెలుపు మాదంటే మాదే అంటూ టీఆర్ఎస్, బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతలో ఓ నకిలీ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లెటర్ హెడ్ పై రాసి ఉన్న లేఖ అది. బీజేపీ ఓటమికి తాను పూర్తిగా బాధ్యత వహిస్తున్నానంటూ రాసిన ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మునుగోడులో ఓటమికి పూర్తి బాధ్యత తనదే అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసినట్లుగా ఆ లేఖ ఉంది. అక్టోబర్ 31వ తేదీన బండి సంజయ్ ఆ లేఖ రాసినట్లుగా ఉంది.
అయితే, వైరల్ అవుతున్న ఆ లేఖపై బండి సంజయ్ స్పందించారు. అది తాను రాయలేదని స్పష్టత ఇచ్చారు. అది కూడా టీఆర్ఎస్ డ్రామా అంటూ కొట్టిపారేశారు. ఫామ్ హౌజ్‌లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా ఫ్లాప్ అయిందని, దాంతో ఈ ఫేక్ లేఖను విడుదల చేశారని అన్నారు. మునుగోడులో బీజేపీ భారీ విజయం నమోదు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు బండి సంజయ్ ఓ ట్వీట్ చేశారు.
‘‘ఫాంహౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా ఫ్లాఫ్ అవ్వడంతో ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న టీఆర్ఎస్ మోసగాళ్లు ఓ నకిలీ లేఖను విడుదల చేశారు. టీఆర్ఎస్ మోసాలు, అబద్దాలు నవంబరు 3తో ముగుస్తాయి. బీజేపీ రికార్డు విజయం సాధిస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా జీవితం నుంచి నిజమైన రాజీనామా చేయాల్సి వస్తుంది’’ అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.