Police Seized Liquor At Munugode ByElections: ఒక్క మునుగోడు ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో ప్రలోభాల పర్వానికి తెరతీశారు నేతలు. ఓ చోట్ల లక్షలు, కోట్ల రూపాయల నగదు పట్టుబడుతుంటే, మరోచోట మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. మంగళవారం ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఓ టీఆర్ఎస్ నేత ఇంట్లో భారీ ఎత్తున మద్యం స్వాధీనం చేసుకున్నారు. మరోచోట రూ.93 లక్షల 50 వేల నగదును పోలీసులు పట్టుకున్నారు. 


టీఆర్ఎస్ నేత ఇంట్లో మద్యం స్వాధీనం.. 
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో సోమవారం ఐటీ అధికారులు నిర్వహించారు. మరుసటి రోజు సీఆర్‌పీ పోలీసులు నాంపల్లి మండలం పసునూరులో ఓ టీఆర్ఎస్ నేత ఇంట్లో ఆకస్మిక తనికీలు చేపట్టారు. టీఆర్ఎస్ నేత వెంకట్ రెడ్డి ఇంట్లో భారీ ఎత్తున మద్యంతో పాటు కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మద్యం, నగదుతో పాటు ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన గోడ గడియారాలు, కూల్‌డ్రింక్స్, పార్టీ గొడుగులను సీఆర్పీ స్పెషల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


తూఫ్రాన్ పేట చెక్‌పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టివేత 
హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ కు స్కార్పియో వాహనంలో నగదు తరలిస్తుండగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాదు నుండి కారులో రూ. 93.50 లక్షల నగదును చౌటుప్పల్ వైపు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. హిమాయత్ నగర్‌కు చెందిన నాందేవ్ అనే వ్యక్తి గచ్చిబౌలి‌కి చెందిన రాజీవ్ యాదవ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. 


నాందేవ్ తన స్కార్పియో వాహనంలో రూ.93 లక్షల 50 వేల నగదును చౌటుప్పల్‌కు తరలించేందుకు డీల్ కుదుర్చుకోగా.. అతడికి రూ.50 వేలు ఇస్తామని చెప్పాడు. పక్కా సమాచారంతో పోలీసులు తూప్రాన్ పేట్ చెక్ పోస్ట్ వద్ద స్కార్పియో వాహనం తనిఖీ చేశారు. ఈ క్రమంలో కారు స్టెఫినీ పరిశీలించగా అందులో డబ్బు అమర్చినట్లు గుర్తించారు. రూ. 93లక్షల 50 వేల రూపాయల నగదు సీజ్ చేసిన పోలీసులు నామ్ దేవ్ ను అరెస్ట్ చేశారు. నగదుకు సంబంధించి రశీదులు, పత్రాలు చూపించాలని ప్రశ్నించగా.. నాందేవ్ తన వద్ద ఏ ఆధారాలు లేవని చెప్పడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేప్టటారు. ఓ వ్యక్తికి ఆ నగదును అప్పజెప్పాలని రాజీవ్ యాదవ్ అతనికి చెప్పినట్లు విచారణలో వెల్లడైంది.


మునుగోడులో ముగిసిన ప్రచారం 
మునుగోడు ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు మైకులు మూగబోయాయి. స్థానికేతరులు అందరూ నియోజకవర్గాన్ని వదిలి పెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చు. మూడో తేదీన పోలింగ్ జరగనుంది. తెలంగాణ రాజకీయాలను మార్చేస్తుందని భావిస్తున్న ఉపఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా ఇప్పటికే పేరు తెచ్చుకుంది. దానికి తగ్గట్లే రాజకీయ పరిణామాలూ హై టెన్షన్‌గా చోటు చేసుకుంటున్నాయి.