Minister Harish Rao: మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షో చేస్తూ.. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతల మాటల వింటే గోస పడాల్సి వస్తుందని హెచ్చరించారు. 15 రోజుల నుంచి ఎవరు ఏం చెప్పారో అన్ని విన్నరు... ఎవరు మీకు మంచి చేస్తారనిపిస్తే వాళ్లకు ఓటేయమని మంత్రి హరీష్ రావు ప్రజలకు సూచించారు. కేసీఆర్ మనుగోడుకు వచ్చిన తర్వాత బీజేపీ వాళ్లు జబ్బలు జార విడిచారంటూ కామెంట్లు చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయంమైందని తెలిపారు. గతంలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకి ఓట్లు వేసి గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేయలేరని తెలిపారు. నీళ్ల కోసం ఈ ప్రాంత ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా కనీసం ఇళ్లకు నీళ్లు అందిచలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంకర్ నుంచి నీళ్లు తెచ్చుకోవడం వల్ల.. ఈ ప్రాంత ప్రజల భుజాలు కాయలు కాశాయని తెలిపారు. ఇవాళ ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన కేసీఆర్ ను సాదుకోవాలో, చంపుకోవాలో మీరే ఆలోచించండి అని మంత్రి హరీష్ రావు వివరించారు. 


'టీఆర్ఎస్ ను గెలిపిస్తే.. కాలువల ద్వారా పంటపొలాలకు నీళ్లు!


టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే.. నల్లాల ద్వారా ఇంటింటికీ నీళ్లు ఎలా ఇచ్చామో, పంట పొలాలకు కాలువల ద్వారా కూడా అలాగే నీళ్లందిస్తామని అన్నారు. బీజేపీ పార్టీతో మాట్లాడుకుని రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్టు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఇది స్వయంగా రాజగోపాల్ రెడ్డి చెప్పుకున్నారని అన్నారు. ఆరు నెలల కింద తనకు కాంట్రాక్ట్ ఇచ్చారని, అందుకే బీజేపీ వాళ్లను సంతోష పెట్టేందుకు రాజీనామా చేశాడంటూ విమర్శలు గుప్పించారు. కనీసం మునుగోడ మహిళలు కూర్చోవడానికి మహిళా సంఘ భవనాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి కట్టించలేరని అన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, 24 గంటల ఫ్రీ కరెంటు, రైతు బంధు, కేసీఆర్ కిట్ వంచి పథకాలను తీసుకొచ్చి పేద ప్రజలు టీఆర్ఎస్ అండగా నిలిచిందని వివరించారు. మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. 


అన్నింటి ధరలు పెంచడం తప్ప వారు చేసిందేమీ లేదు..


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. 400 రూపాయల గ్యాస్ బండ ధరను 1200 చేసిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాజగోపాల్ కు 18 వేల కాంట్రాక్ట్ ఇచ్చిందని, అలాగే పెట్రోల్, డిజిల్ ను ధరలను వంద రూపాయలు చేసిందన్నారు. పేద ప్రజలను తిననివ్వకుండా.. ఉప్పు, పప్పు వంటి నిత్యావసర సరుకుల ధరలను కూడా పెంచిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాళ్లకు ఓటు వేసి గెలిపిస్తే.. మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేనేలేదని అన్నారు. ఓటు వేస్తే.. ఓటు కూడా పాడువుతుందంటూ విమర్శించారు. బీజేపీ వాళ్లు పైసా బలంతో గెలుస్తామని చెబుతున్నారని... పైసా బలం గెలవాలో, ప్రజాబలం గెలవాలో మీరే తేల్చాలన్నారు. వడ్లు కొనమంటే చేతగాని బీజేపీ నేతలు.. ఎమ్మెల్యేలను కొనేందుకు ముందుకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు. 


బీజేపీ మీది కోపాన్నంతా.. టీఆర్ఎస్ కు ఓట్లేస్తూ చూపించాలి!


చేనేతపై జీఎస్టీ కోసం బీజేపీ నేతలు చాలా మాట్లాడారని మంత్రి హరీష్ రావు వివరించారు. తాను హైదరాబాద్ లో రుజువులతో సహా అన్ని మాట్లాడితే బండి సంజయ్, కిషన్ రెడ్డి తలదించుకున్నారని వివరించారు. తెలంగాణ చేనేతపై జీఎస్టీని వ్యతిరేకించిందని చెబితే కిక్కురమనట్లేదని అన్నారు. అక్కా,చెళ్లెల్లంతా ఇంటి ముందు నల్లాలను చూసి, వంట రూంలో గ్యాస్ సిలిండర్ చూసి... కసికసిగా ఓట్లు వేయండని సూచించారు. గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి పోలింగ్‌కు వెళ్లాలన్నారు.