Srisailam News: శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం వంటగదిలో ఈరోజు ఉదయం బాయిలర్ పేలింది. దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్ లో ఒక్కసారిగా బాయిలర్ పేలడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. పెద్దగా శబ్దం రావడంతో అక్కడున్న వాళ్లంతా బయటకు పరుగులు పెట్టారు. అయితే ఆ మల్లికార్జున స్వామి వారి దయ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చాలా సేపటి తర్వాత సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా.. టిఫిన్ తయారీకి ఉపయోగించే వంట గదిలోని స్టీమ్ వాటర్ బాయిలర్ పేలింది. దీని వల్ల పెద్ద శబ్దం వచ్చిందని గుర్తించారు. నిత్య అన్నదానం బయటవైపు ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. బాయిలర్ పేలుడుకు కారణలేంటని పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
నిన్న కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలానికి చేరుకున్నారు. అక్కడే ఉండటంతో నేడు కూడా భక్తులు రద్దీ ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయంలోని కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లన్నీ నిండిపోయాయి. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. దీంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లలో వేచి ఉన్న వారికి వేడి పాలు, ప్రసాదం అందించారు. అయితే భక్తులకు టీ, టిఫిన్, పాలు, నిత్యాన్నదానం అందించే వంట గదిలోనే ఈ పేలుడు సంభవించింది.
శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం - ముగ్గురు దుర్మరణం
అరగంటలో గమ్య స్థానానికి చేరుకుంటామనుకుంటుండగా.. నిద్రమత్తులో వాహనం నడిపి గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టాడు ఓ డ్రైవర్. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 12 మంది ఉండగా.. ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ ఓఆర్ఆర్ వద్ద అర్ధరాత్రి టాటా వాహనo, గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్ కు ఫోన్ చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను యశోద ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది..
క్షతగాత్రుల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు సూచిస్తున్నారు. ప్రమాద సమయంలో టాటాఏస్ వాహనంలో మొత్తం 12 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. గుమాడిదల్లా నుంచి శ్రీశైలం దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇక మరో అరగంటలో గమ్యస్థలానికి చేరుకుంటాం అనుకునేలోపే ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని నడపడం వల్ల తన ముందు వెళ్తున్న భారీ వాహనాన్ని ఢీకొట్టాడని.. నిద్ర మత్తు వల్లే డ్రైవర్ తో సహా ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారని మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గతంలో కూడా సదరు డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని నడపడంతో.. అతడిని పనిలో పెట్టుకున్న యజమాని సదరు డ్రైవర్ ను తొలగించినట్లుగా తెలిసిందని చెప్పుకొచ్చారు.