గలగలా పారే కృష్ణా నది! పక్కనే నల్లమల అరణ్యం! ఇటు పక్కన నాగార్జునకొండ! ఆ శైలమే తథాగథుడు నడయాడిన నేల! ఆ కొండే ఆచార్య నాగార్జునుడు సంచరించిన ప్రదేశం! అష్టాంగ మార్గాలకు అదొక ఆలవాలం! బుద్దుని జీవత విశేషాల సమాహారం! శిలల రూపంలో కళ్లకు కట్టినట్లు నిర్మించిందే ఆ బుద్దవనం! తెలంగాణ ప్రభుత్వం ఆధునీకరించిన తర్వాత తథాగథుడి చెంతకు విదేశీ పర్యటకులు క్యూ కడుతున్నారు!
బుద్ధవనం! ప్రపంచంలోని బౌద్దులకు అదొక పవిత్ర భూమి! ప్రకృతితో మమేకమైన ఆ ప్రదేశంలో నడుస్తున్నంత సేపు ముక్తిమార్గం బోధ పడుతుంది. పూలవనంలో విహరిస్తున్నంత సేపు సమ్యక్ దృష్టి అంటే ఏంటో అవగతమవుతుంది! అనుభవం రుజువు కాని ఏ విషయాన్ని బుద్ధుడు అంగీకరించలేదు! ఆ వనంలో తిరుగుతున్న ప్రతీ ఒక్కరిలో అదే భావన కలుగుతుంది! అడుగు పెట్టగానే మనసంతా నిర్మల మనస్సుతో ధాన్యంలోకి వెళ్లిపోతాం! కనుచూపు మేరలో పచ్చదనం మరోలోకంలోకి తీసుకుపోతుంది! తీరొక్క పూల బృందావనం జీవకారుణ్య ఔన్నత్యాన్ని ఎత్తిచూపుతుంది!
మొత్తం 279 ఎకరాలు! బుద్దవనం పేరుతో తెలంగాణ ప్రభుత్వం అందంగా తీర్చి దిద్దింది. గౌతమబుద్దుడి సమకాలీనంలోనే ఇక్కడి 14 మంది యువకులు బుద్దుని శిష్యరికం చేసి, బౌద్ధమత వ్యాప్తి చేశారు అనేది చరిత్ర. ఇక్కడ దొరికిన శాసనల్లోనూ అదే ఉంది! ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి విద్యను అందించారు. అంత గొప్ప చరిత్ర గల పవిత్ర భూమి నాగార్జున సాగర్. సాగర్ డ్యాం నిర్మాణం సమయంలో జరిపిన తవ్వకాల్లో ఈ చరిత్ర బయల్పడింది. 1926లో మెట్టమెదటిసారి చారిత్రక ఆధారాలు దొరికాయి. ఆ తర్వాత భారత ప్రభుత్వం 1953 నుంచి 1963 వరకు ఇక్కడ తవ్వకాల్ని చేపట్టింది. ఆ తవ్వకాల్లో బుద్దుడి జీవిత విశేషాలు, ఆచార్య నాగార్జునుడి విశ్వ విద్యాలయం, అప్పటి వస్తువులు, చారిత్రక ఆధారాలు అన్ని బయటపడ్డాయి. వాటన్నింటినీ మ్యూజియం ఏర్పాటు చేసి భద్రపరిచారు. వాటితోపాటు బౌద్ధవారసత్వాన్ని ప్రపంచానికి చాటేలా, బుద్దుని జీవిత విశేషాల్ని, బుద్ధిజం గొప్పదనాన్ని, ఆయన శిష్యుల సమాచారాన్ని, అష్టాంగమార్గాలను ఈతరానికి పరిచయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ లో బుద్దవనాన్ని నిర్మించింది.
భూటాన్, టిబెట్, సౌత్ కొరియా, కాంబోడియా, వియత్నాం, శ్రీలంక, మయన్మార్, థాయ్ లాండ్, నేపాల్, మలేషియా, తైవాన్, ఛైనా ఇలా ప్రపంచలోని అనేక దేశాల నుంచి ప్రతిరోజు పదుల సంఖ్యలో బౌద్ధ భిక్షువులు ఈ బుద్దవనాన్ని సందర్శించడానికి వస్తుంటారు. మినిమం వారంరోజుల పాటు ఉంటారు. ప్రత్యేక ప్రార్ధనలు, ప్రవచనాలు, ధాన్యం చేసుకుంటూ ప్రశాంతంగా గడుపుతారు. ఇక్కడికి వచ్చే బౌద్ద భిక్షువులకు ప్రత్యేకంగా వసతి సదాపాయాలు కల్పించింది ప్రభుత్వం. వారి ఆహార అలవాట్లకు తగ్గట్టుగా వంటలు వండి పెడ్తారు! వేకువ జాము నుంచే ఆచరించే పద్దతులకు అనుగుణంగా ప్రత్యేక సదుపాయాల్ని కల్పించింది టూరిజం శాఖ. ప్రపంచంలోని, దేశంలోని వివిధ యూనివర్సిటీల విద్యార్దులు ఇక్కడికివచ్చి పరిశోధనలు చేస్తున్నారు. వారికి కూడ ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. టూరిజం శాఖ ఇక్కడ ప్రత్యేక కాటేజీలను నిర్మించింది. విజయ్ విహార్, హరిత ప్లాజా పేరుతో ప్రత్యేక హాటల్స్ ఇక్కడ అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. అందుకే బౌద్దులు, వివిధ దేశాల విద్యార్దులు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన బుద్దచరిత వనం, బోధిసత్వవనం, ఆచార్య నాగార్జున వనం, మహాస్థూపం, స్దూపవనం, అవకాన బుద్ద పార్క్, ఎంట్రన్స్ ప్లాజా, జాతక పార్క్, చరితవనం, 36 అడుగుల ఎత్తైన బుద్దుడి ఏకశిలా విగ్రహం, బౌద్దవిహారాలు, స్థూపాలు, ధ్యానమందిరం, అంతర్జాతీయ విజ్ఞాన కేంద్రం, మ్యూజియం, కన్వెన్షన్ హాల్, రిసార్టులు, ఫుడ్ కోర్టులు, బోటింగ్, బుద్దుడి పాదుకలు ఇలా అణువణువై కళ్లు చెదిరే శిల్పకళా వైదూష్యంతో బుద్దవనం అలరారుతున్నది. ఎటు చూసినా పచ్చటి వనం! 3వేల రకాల పూల మెక్కలు అహ్లాదాన్ని పంచుతున్నాయి. బుద్దవనం గొప్పతనాన్ని తెల్సుకోవాలని దలైలామా ఇక్కడికి వచ్చి ఒకరోజు ఉండి ఇక్కడ బోధి వృక్షాన్ని నాటి శాంతి సందేశం ఇచ్చి వెళ్లారు. ఆరోజు నుంచి ఈ ప్రాంతం బుద్ధులకే కాదు, అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ద్వారా దుఃఖాన్ని తొలగించుకోవచ్చన్న ప్రతీ ఒక్కరు ఇక్కడికి వచ్చి బుద్దుని ఆరాధనలో మునిగిపోతున్నారు! ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న ఈ బుద్ధవనాన్ని టైం దొరికినప్పుడు మీరూ సందర్శించండి!
బుద్దుడు సూచించిన అష్టాంగమార్గాలివే!
సమ్యక్ దృష్టి: ప్రపంచాన్ని సరైన దృష్టితో చూడాలి.
సమ్యక్ సంకల్పం: ఆలోచన ఎప్పుడూ స్వచ్ఛంగా, హితంగా ఉండాలి.
సమ్యక్ భాషణం: మాట మధురంగా ఉండాలి. మంచిని పంచేదై ఉండాలి.
సమ్యక్ కర్మం: చేసేపని పరహితమై, లోక శ్రేయస్సును కోరేదై ఉండాలి.
సమ్యక్ జీవనం: ఇతరులను అన్యాయం చేయకుండా ధర్మబద్ధమైన జీవనం గడపాలి.
సమ్యక్ యత్నం: ఏ పని చేయడానికైనా సముచితమైన ప్రయత్నం ఉండాలి.
సమ్యక్ స్మృతి: చేస్తున్న పని మీద, చెబుతున్న మాట మీద అప్రమత్తం కలిగి ఉండాలి.
సమ్యక్ సమాధి: మనసును చెదరనీయకుండా ఏకాగ్రతతో ఉండాలి.