Munugodu Bypoll : రెండు వారాల క్రితం వరకు అప్పుడే ఉపఎన్నికలు వచ్చాయా? అన్నట్లుగా మునుగోడు చుట్టూ తిరిగిన రాజకీయాలు ఇప్పుడు మాత్రం ఒకేసారి సైలెంట్‌ అయ్యాయి. అయితే అసలు మునుగోడులో ఏం జరుగుతుందో తెలుసా? అంటే అందుకు సమాధానం మాత్రం ఇప్పటి వరకు కేవలం నాయకులను జంప్‌ జిలానీలుగా మార్చిన పార్టీలు ఇప్పుడు జనం మూడ్‌ తెలుకునే పనిలో పడ్డారు. 


పార్టీ ఫిరాయింపులు 


తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారిన మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక ఇప్పుడు సైలెంట్‌గా మారింది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు భారీ సభలతో మునుగోడు నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఓ వైపు కేంద్ర మంత్రి అమిత్‌షా నేరుగా మునుగోడుకు రాగా మరోవైపు కేసీఆర్‌ సైతం ఆశీర్వాద సభలతో భారీ సభలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా మునుగోడు కేంద్రంగానే సుమారు నెల రోజుల పాటు రాజకీయ సమరం సాగింది. ఆ తర్వాత ఒక్కో పార్టీ తమ స్థాయిని బట్టి ఫిరాయింపుల కోసం చిన్న స్థాయి నాయకుడి నుంచి పై స్థాయి నాయకుడి వరకు భారీ తాయిలాలతో హడావుడి చేసిన నేతలు ఇప్పుడు అసలు విషయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సర్పంచ్‌లు, ఎంపీటీలను పార్టీలు మార్చుకునేందుకు రూ. లక్షల్లో తాయిలాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఓ పార్టీ ఏకంగా కొత్త కొత్త కార్లను ఇంటి ముందు నిలిపి వారిని పార్టీ ఫిరాయింపులు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత భారీ ఖర్చుతో కూడిన ఎన్నికగా మునుగోడు ఉపఎన్నిక మారింది. ఇప్పటి వరకు ఇదంతా చేసిన నాయకులు ఇప్పుడు జనం వైపు దృష్టి మరలినట్లు తెలుస్తోంది.


ప్రజల పల్స్‌  తెలియక తికమక 


ఒక ప్రాంతంలోని పెద్ద నాయకుడు తమ పార్టీలో చేరితో అక్కడ ఉన్న మెజారిటీ జనం మనవైపే మొగ్గుచూపుతారనే పాత కాలం ట్రెండ్‌ మారింది. ఇప్పుడు నాయకులతో సంబంధం లేకుండా ఓటర్లు తమ నిర్ణయం తామే తీసుకుంటున్నారు. కొంత మేరకు నాయకుల ప్రభావం ఉన్నప్పటికీ మెజారిటీ ఓటర్ల ఆలోచన మాత్రం మారింది. అందుకు కారణం వారిలో చైతన్యమే.. ఎవరు ఎంతిచ్చినా వద్దనకుండా గుట్టుకున గుంజేసీ తాము అనుకున్నది చేసేద్దామనే ఫీలింగ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ఓటర్లలో ఈ చైతన్యం ఎక్కువగా లేనప్పటికీ పట్టణాల్లో మాత్రం ఇది స్పష్టంగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా యువకుల్లో మాత్రం ఈ మార్పు ఎప్పుడో జరిగిపోయింది. అయితే కోట్లాది రూపాయలు కుమ్మరించి నాయకులను కొనుగోలు చేసినా చివరకు ఓటరు మాత్రం తన తీర్పు ఏం ఇస్తారో? అనే భయంతో క్షేత్రస్థాయి నాయకులు ఉన్నట్లు సమాచారం.


గ్రామాల్లో పర్యటనలు


ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మంత్రి జగదీశ్వర్‌రెడ్డి గ్రామాలలో పర్యటించడంతోపాటు అక్కడున్న కార్యకర్తలను జనంలోకి వెళ్లేలా ఆదేశాలు జారీచేస్తున్నారు. మరోవైపు తన రాజీనామాతో ఉపఎన్నికలు రావడం, ఈ గెలుపు తన రాజకీయ భవిష్యత్‌కు కూడా కీలకం కావడంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సైతం గ్రామాల పర్యటనలో పడ్డారు. మరోవైపు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌ చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ కరపత్రాలతో ప్రజలకు చేరువయ్యేందుకు చూస్తుంది. నాయకులే కాదు ఓటర్లు ముఖ్యం అనే భావనలో ఉన్న అన్ని పార్టీలు ఇప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామస్థాయిలోకి చేరుకుంటున్నారు. దీంతో భారీ హడావుడి నడుమ ప్రారంభమైన మునుగోడు ఉపఎన్నిక ఇప్పుడు కాస్తా సైలెంట్‌గా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మునుగోడు ఓటరు ఎలాంటి తీర్పు ఇస్తారు. ఏ పార్టీ చేసే ప్రచారానికి ఆకర్షితులవుతారో వేచి చూడాల్సిందే.


Also Read : Nirmala Sitharaman Vs Harish Rao : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు హరీష్ రావు సవాల్, అది నిరూపిస్తే రాజీనామా


Also Read : సూర్యుడు అస్తమించకుండా ప్రయత్నాలు చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు!