Nirmala Sitharaman Vs Harish Rao : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పెట్టాలని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. తుఫ్రాన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ షాపులో ప్రధాని మోదీ ఫొటోలేదని అడగడం హాస్యాస్పదం అన్నారు. ప్రధాని స్థాయిని దిగజార్చేలా మాట్లాడారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ స్థాయిని తగ్గించుకునే పనులు చేస్తుందని ఆరోపించారు. రేషన్ షాపులకు మొత్తం బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇవ్వదని గుర్తుచేశారు. ఎన్ఎఫ్సీఏ కింద రేషన్ కార్డులు కేవలం 50-55 శాతం మాత్రమేనన్నారు. కిలో రూ.3 లకు బియ్యం ఇస్తే అందులో రూ. 2 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. మిగిలిన 40-45 శాతం కార్డులను తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు. పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమంలో రూ. 3610 కోట్ల ప్రతి సంవత్సం ఖర్చుపెడుతున్నామన్నారు. అలా అని ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకోవచ్చు కదా! కానీ అలా చేయడంలేదన్నారు.    


అక్కడ కేసీఆర్ ఫొటో పెట్టండి 


" దేశానికి ఐదారు రాష్ట్రాల నుంచి ఆదాయం వస్తుంది. దానిని పేద రాష్ట్రాలకు పంచుతుంటారు. ఆ ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశానికి మేం రూ. 1.70 లక్షల కోట్లు అదనంగా ఇచ్చాం. తెలంగాణ డబ్బుతో దేశాన్ని సాకుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ డబ్బుతో కేంద్రం పథకాలు అమలు చేస్తుంది. అక్కడ మా కేసీఆర్ ఫొటో పెట్టండి. కేంద్రంలో మా కేసీఆర్ ఫొటో పెట్టండి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.3,65, 795 కోట్లు రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1,96,448 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రాన్ని సాకడంలో , పేద రాష్ట్రాలను సాకడంలో తెలంగా ప్రజల కష్టం ఉంది. కేసీఆర్ కష్టం ఉంది. అయితే సీఎం కేసీఆర్ ఫొటో మీరు కేంద్రంలో పెట్టండి. బీజేపీ వాళ్లు మాట్లాడేవన్నీ కూడా అసత్యాలు, అర్ధసత్యాలు. మేము మాట్లాడేవి నగ్నసత్యాలు. కానీ గోబెల్స్ ప్రచారం చేస్తేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉచిత బియ్యంపై తెలంగాణ పెట్టే ఖర్చు రూ.3610 కోట్లు ఆ విషయం నిర్మలా సీతారామన్ మర్చిపోకూడదు." - మంత్రి హరీష్ రావు 


కేంద్ర మంత్రుల అబద్దాలు! 


కేంద్ర మంత్రులు అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. అబద్ధాలు మాట్లాడకపోతే తలపగిలి చనిపోతారని ఉన్న సామెత బీజేపీ నేతలు వర్తిస్తుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మధ్య మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నారని, కానీ మెదక్ , సిద్ధిపేటలో ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నుల పంట కాళేశ్వరం పుణ్యమే అని మంత్రి అన్నారు.  కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిందన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అన్నారన్నారు. తాగునీరు, సాగునీరు కాళేశ్వరం నుంచి అందిస్తున్నారని, అందుకు కేంద్రమే అనుమతులు ఇచ్చిందని నితిన్ గడ్కరీ అంటారన్నారు. కేంద్రమంత్రులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 


రాజీనామాకు సిద్ధం


"ఆయుష్మాన్ భారత్ కేవలం బీపీఎల్ కుటుంబాలకే ఇస్తామని కేంద్రం చెబుతోంది. కేంద్రం కేవలం 26 లక్షల మందికి ఇస్తే తెలంగాణ ప్రభుత్వం 96 లక్షల మందికి ఆరోగ్య శ్రీ అందిస్తుంది. కేంద్రం ఆయుష్మాన్ భారత్ లో రూ.150  కోట్లు ఇస్తే తెలంగాణ రూ. 858.99 కోట్లు ఖర్చుపెట్టంది. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరకపోతే రూ.150 కోట్లు ఎందుకు ఇచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి తెలంగాణ ఆయుష్మాన్ భారత్ లో చేరలేదని చెప్పారు. మేం ఈ పథకంలో చేరకపోతే రూ.150 కోట్లు ఇచ్చారు. తెలంగాణ ఆయుష్మాన్ భారత్ లో చేరలేదన్నది వాస్తవం అయితే నేను నా పదవికి రాజీనామా చేస్తాను. మీరు రెడీనా. నిర్మలా సీతారామన్ చెప్పంది అవాస్తవం. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి."- మంత్రి హరీష్ రావు 


ప్రధాని ఫొటో లేదని నిర్మలా సీతారామన్ అభ్యంతరం 


కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రేషన్‌ షాపులను పరిశీలించారు. రేషన్ షాపులో ప్రధాని మోదీ ఫ్లెక్సీ  పెట్టడానికి అభ్యంతరం ఏమిటని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. ఉచిత బియ్యంలో ఒక్క కేజీకి 35  రూపాయలు ఖర్చు అవుతుందని.. అందులో 5 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే రూపాయి ప్రజలు ఇస్తారని తెలిపారు. మిగతా 29 రూపాయలను కేంద్రం ఖర్చు చేస్తుందని... అలాంటప్పుడు ప్రధాని మోడీ ఫ్లెక్సీ రేషన్ షాపులో పెట్టడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి హరీష్ రావు తాజా స్పందించారు.