Shivamurthy Murugha Sharanaru:
రెండేళ్లుగా వేధింపులు..?
మైనర్ బాలికలను లైంగికంగా వేధించాడనే కేసులో కర్ణాటకలోని శ్రీ మురుగ మఠం అధిపతి శివమూర్తి మురుగ శరణరుని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చిత్రదుర్గలోని జైళ్లో ఆయనను ఉంచారు. త్వరలోనే ఆయనను కోర్టులోకి ప్రవేశపెట్టి ఆయనను రిమాండ్‌కు తరలించాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే...ఈ లోగా ఆయనకు ఛాతీలో నొప్పి రావటం వల్ల ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరు మైనర్ బాలికల్ని లైంగికంగా వేధించాడన్న కేసులో పోలీసులు ఆయనను గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్నిఅడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (AGDP) అలోక్ కుమార్ వెల్లడించారు. శివమూర్తి మురుగ శరణుకి వైద్య పరీక్షలు కూడా చేయించారు. "ఆయనకు ఇప్పటికే వైద్య పరీక్షలు చేయించాం. అవసరానికి అనుగుణంగా మిగతా టెస్ట్‌లు చేయిస్తాం. పద్ధతి ప్రకారమే విచారణ కొనసాగుతుంది. ఆయనను జడ్జ్ ముందు ప్రవేశపెడతాం" అని అలోక్ కుమార్ స్పష్టం చేశారు. చిత్రదుర్క ఎస్‌పీ పరశురామ కూడా ఈ విషయంపై మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు.
న్యాయం అందించాలి: భాజపా ఎంపీ
"మేము శివమూర్తి మురగ శరణరుని అరెస్ట్ చేశాం. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం. ఈ కేసులో సంబంధం ఉన్న మహిళను ప్రశ్నిస్తున్నాం. ఆమె ప్రస్తుతానికి మా కస్టడీలో ఉన్నారు. మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదు. మెడికల్ చెకప్ అయిపోయి తరవాత మిగతా ప్రొసీజర్ ఫాలో అవుతాం" అని పరశురామ స్పష్టం చేశారు. దాదాపు రెండేళ్లుగా తమను లైంగికంగా వేధిస్తున్నట్టు మైనర్ బాలికలు చెబుతున్నారు. పలువురు రాజకీయ నేతలు ఆయనను తరచూ కలుసుకుంటూ ఉంటారు. ఇటీవలే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్... చిత్రదుర్గలోని ఆయన మఠానికి వెళ్లి సందర్శించుకున్నారు. దీనిపై భాజపా ఎంపీ లహర్ సింగ్ సిరోయా స్పందించారు. "ఇది చాలా షాకింగ్‌గా ఉంది. మన చుట్టుపక్కలే ఇలాంటివి జరిగిన ప్రతిసారి మా నమ్మకం సడలుతోంది. కర్ణాటక ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోవాలి. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా కేసుని పరిష్కరించాలి. ఆ మైనర్ బాలికలకు సరైన న్యాయం అందించాలి" అని ఎంపీ లహర్ సింగ్ అన్నారు.