Pawan Kalyan : తెలంగాణ రాజకీయ సమరంలో జనసేన ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన, ప్రమాదంలో మరణించిన జనసేన క్రియాశీలక కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. పవన్ అడుగడుగునా అభిమానులు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. ఎల్బీనగర్ పరిధిలోని అల్కాపురి చౌరస్తాలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్ ​కు పెద్ద పూలమాలతో స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. 


తెలంగాణలో జనసేన జెండా 


తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. భవిష్యత్తులో తెలంగాణలో జనసేన జెండా ఎగరడం ఖాయమన్నారు. తెలంగాణ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన యువత, ఆడపడుచులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై చర్చించి, కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామని పవన్ అన్నారు. వచ్చే సార్వత్రికి ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అణగారిన వర్గాలకు, ఆడపడచులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. 






జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ 


"తెలంగాణ ప్రాంతమంటే నాకెంతో ఇష్టం. ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆడుపడుచులు స్వాగతం పలకడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేద్దామని నిర్ణయించుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల నా మాటను మన్నించి ఇక్కడి నేతలు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వచ్చే సార్వత్రికి ఎన్నికల్లో తెలంగాణలో బలాబలాలు పరిశీలించుకుని అన్ని ప్రాంతాల్లో పోటీ చేద్దాం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేసి జనసేన సత్తా చూపిద్దాం" అని పవన్ కల్యాణ్ అన్నారు. 


తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 17 వేల పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కొందరికి వయో పరిమితి సడలింపు ఇబ్బందులు ఉన్నాయని కొందరు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు పవన్. ఎస్టీలకు సంబంధించి 10 శాతం రిజర్వేషన్లు రావాల్సి ఉందని పవన్ అన్నారు.