నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ గిరిజన హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ఉన్న హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం సమయంలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా తెలుస్తోంది. అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి బాలికలను తరలించి వైద్యం ప్రారంభించారు. కొంత మంది బాలికలు ఆస్పత్రి పడకపై కడుపు పట్టుకొని గిలగిలా కొట్టుకుంటున్న వీడియోలు కలవర పరుస్తున్నాయి.


భోజనం తిన్న తర్వాత వారంతా కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. బాలికల పరిస్థితి గమనించిన పాఠశాల సిబ్బంది.. వారిని వెంటనే మన్ననూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. ముందు జాగ్రత్తగా స్కూల్‌లోని మొత్తం 300 మంది విద్యార్థులను ప్రత్యేక అంబులెన్స్‌ల్లో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 10 మంది బాలికలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వారికి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. బాలికల పరిస్థితిని డీటీడీవో పర్యవేక్షిస్తున్నారు. హాస్టల్‌ వార్డెన్‌ లేకపోవడంతో విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి శ్రీశైలం ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.