Babu tho Nenu: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకించాలని టీడీపీ పార్టీ పిలుపునిచ్చింది. 'బాబుతో నేను' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సైకో ప్రభుత్వాన్ని ప్రశ్నించి.. బాబుతోనే నేను అంటూ గొంతెత్తి చాటాలని ప్రజా చైతన్య కరపత్రాన్ని విడుదల చేసింది. 92612 92612 నంబర్ కు మిస్ట్ కాల్ ఇచ్చి చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించాలని, బాబుతో నేను అని చాటి చెప్పాలని తెలుగు దేశం పార్టీ పిలుపునిచ్చింది. 


అరెస్టుకు చంద్రబాబు చేసిన తప్పు ఏంటి? అంటూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. నైపుణ్య శిక్షణ కేంద్రాలతో మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం నేరమా అంటూ కరపత్రంలో ప్రశ్నించింది. కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం అంటూ పగలు, రాత్రి కష్టపడటం తప్పా?.. ప్రజా సమస్యలు కోసం రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీయడం అపరాధమా?.. అవినీతిపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పాపమా? రాజకీయ కక్షతో చంద్రబాబు గారిపై పెట్టిన కేసును ఖండిద్దాం.. తప్పుడు కేసులపై గళమెత్తుదాం.. జగన్ కుట్రను ఎండగడదాం.. 'బాబుతో నేను' అని చాటి చెపుదాం అని రాసి ఉన్న కరపత్రాన్ని పంచాలని టీడీపీ నిర్ణయించింది.


చంద్రబాబుని అర్ధరాత్రి వేళ, అనాగరికంగా అరెస్టు చేసిన విధానాన్ని ప్రజలంతా ఖండించాలని తెలుగు దేశం పార్టీ నేతలు కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత భవిష్యత్ కోసం నిరంతరం తపించే చంద్రబాబు రాజకీయ కక్షతో అక్రమ కేసు పెట్టారని, ఆధారాలు లేని ఆరోపణలతో జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


బాబు అరెస్టును పార్టీలకతీతంగా ఖండిస్తున్న నేతలు


మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం అన్యాయమని గురువారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మాజీ ముఖ్యమంత్రిని దర్యాప్తు చేసే ముందు ప్రశ్నించకుండా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని కిషన్ రెడ్డి అన్నారు. గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్టు చేసే సమయంలో కేంద్ర సర్కారు నోటీసులు ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.


చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా స్పందించారు. బాబు అరెస్టు బాధాకరమని అన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గురువారం మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. గవర్నర్ అనుమతి లేకుండా మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేయడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రులు పదవిలో ఉన్న సమయంలో అనేక నిర్ణయాలు తీసుకుంటారని, ప్రజల అవసరాల కోసం సౌకర్యాల కోసం, అభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రి పువ్వాడ తెలిపారు. అలాంటి వాటిని సాకుగా చూపి అరెస్టులు చేయడం సరికాదన్నారు. రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు మంచివి కావని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.


టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే బాబును అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. కావాలని కక్ష పూరితంగానే అరెస్టు చేసినట్లు తెలిపారు. నేరం చేస్తే అరెస్టు చేయడాన్ని ఎవరూ కాదనరని.. అయితే ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేకుండా వ్యక్తిని అరెస్టు చేయడమే అర్థం కావట్లేదని చెప్పారు. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. అలాగే చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు. ఈ అరెస్టుతో ఏపీ ప్రజల్లో చంద్రబాబుకి మైలేజీ వచ్చిందని బండి సంజయ్ పేర్కొన్నారు.