Mulugu Crime News: అమ్మానాన్నలు, అక్కా చెల్లెల్లు ఎవరూ లేకపోవడంతో.. అమ్మమ్మ వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. బతుకుదెరువు కోసం కూలి పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. అయితే యువతి ఒక్కతే ఉన్న విషయం గుర్తించిన ఓ యువకుడు.. అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధింపులకు గురి చేశాడు. ఏం చేయాలో పాలుపోని యువతి కత్తితో దాడి చేయగా.. సదరు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
అసలేం జరిగిందంటే..?
ములుగు జిల్లా ఏటూరు నాగారం మూడో వార్డు ఎర్రెళ్లవాడలో.. జాడి సంగీత అనే యువతి తన అమ్మమ్మతో కలిసి ఉంటోంది. ఆమెకు తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవరూ లేరు. ఈ క్రమంలోనే వ్యవసాయ కూలీగా పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. అయితే అదే పట్టణానికి చెందిన పాతికేళ్ల రాంటెంకి శ్రీనివాస్ కు ఇది వరకే వివాహం అయింది. కానీ మనస్పర్థల కారణంగా భార్యా, పిల్లలు అతడిని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం అతడు ఒంటరిగానే ఉంటున్నాడు. మద్యం తాగి రాత్రి వేళ తరచుగా సంగీత ఇంటికి వెళ్లి తలుపులు కొడుతూ ఆమెను వేధించేవాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ బలవంతం చేసేవాడు. అది తట్టుకోలేని సంగీత.. కొన్ని నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. బెయిల్ పై బయటకు వచ్చిని శ్రీనివాస్.. సంగీతపై కోపం పెంంచుకున్నాడు.
ఈ క్రమంలోనే వేధింపులు మరింత ఎక్కువ చేశాడు. తాజాగా బుధవారం రోజు అర్ధరాత్రి మద్యం తాగి సంగీత ఇంటికి వెళ్లాడు. బలవంతం చేస్తూ లైంగిక వాంఛ తీర్చమని నానా రచ్చ చేశాడు. ప్రతిరోజూ ఇలాగే జరుగుతుండడంతో.. కోపోద్రిక్తురాలైన సంగీత.. శ్రీనివాస్ చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపేసింది. అనంతరం రాత్రి 2 గంటలకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై డి. రమేష్ తెలిపారు.
భూమి కోసం పెద్దనాన్నను హత్య చేసిన కుమారుడు
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్ధిపూర్ గ్రామానికి చెందిన చంద్రప్ప, రత్నం అన్నదమ్ములు. వీరికి తాతల నుంచి వచ్చిన వ్యవసాయ భూమి ఉంది. అయితే వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా భూవివాదం నడుస్తోంది. ఈక్రమంలోనే రత్నం కుమారుడు రాకేశ్ పెద్ద నాన్నపై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. ఆయనను అడ్డుతొలగించుకుంటే భూమి అంతా తమకే దక్కుతుందని.. ఎలాంటి సమస్య ఉండదని భావించాడు. వెంటనే ఇందుకోసం ఓ ప్లాన్ వేశాడు. ముందుగా వెళ్లి చంద్రప్ప వచ్చే రోడ్డులో మాటు వేశాడు. మంగళవారం మధ్యాహ్నం రోజు మాదిరిగా వ్యవసాయ పొలానికి వెళ్లి చంద్రప్ప తరిగి వస్తుండగా... బర్ధిపూర్ శివారులోని కుప్పానగర్ -ఎల్గొయి రోడ్డు మధ్యలో మాటేసి ఉన్న రత్నం కుమారుడు రాకేశ్.. కత్తితో దాడి చేశాడు. పెద్ద నాన్న అని కూడా చూడకుండా నరికి నరికి చంపాడు. ఆపై తల, మొండెం వేరు చేశాడు.
తలను ఝరాసంగం శివారులో రోడ్డు పక్కన, మొండెంను మరోచోట విసిరేశాడు. అనంతరం నిందితుడు రాకేశ్ యే నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఝరాసంగం, హద్నూర్ ఎస్సైలు రాజేందర్ రెడ్డి, వినయ్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన స్థలంలో మృతుడి మోటార్ సైకిల్, వాటర్ బాటిల్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. భూవివాదంతోనే రత్నం కుమారుడు పెద్దనాన్న చంద్రప్పను హత్య చేశాడని జహీరాబాద్ రూరల్ సీఐ నోముల వెంకటేష్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.