కావాల్సినదాని కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. అయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కంగారు పడుతోంది. ఇప్పటి వరకూ ఇతరుల ఓట్లను పొందడమే కానీ ఇప్పటి వరకూ పొగోట్టుకున్న దాఖలాలు లేవు. అయినా ఇప్పుడు తమ ఓట్లను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ నేతలు క్యాంపులు పెట్టారు. స్థానిక సంస్థల కోటాలో ఆరు స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. ఆరింటికి మాత్రమే పోలింగ్ జరుగుతోంది. మగిలినవి ఏకగ్రీవం అయ్యాయి. ఆరు స్థానాల్లో టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉంది. మొత్తంగా 5,326 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటర్లుగా ఉంటే.. వీరిలో 70 శాతం టీఆర్ఎస్‌కు చెందిన వారే. అన్ని స్థానాల్లోనూ ఏకపక్షంగా గెలిచే బలం టీఆర్ఎస్‌కు ఉంది. అయినా టీఆర్ఎస్ ఓటర్లను క్యాంపులకు తరలించారు.
Also Read : కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ దగ్గరవుతోందా ? దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోందా ?
మెదక్ ఓటర్లను క్యాంపులకు తరలించిన టీఆర్ఎస్ !
సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లోనూ టీఆర్ఎస్ ఓటర్లను కాపాడుకునేందుకు క్యాంపులు పెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య పోటీలో నిలబడ్డారు. కాంగ్రెస్‌కు గెలవడానికి కాదు కదా.. గట్టిపోటీ ఇవ్వడానికి కూడా అవసరమైన బలం లేదు. మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,027 ఓటర్లకు గాను అధికార టీఆర్ఎస్ 750 వరకు ఓట్లు ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ ఎందుకైనా మమంచిదని కాంగ్రెస్ లీడర్లు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కలవకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలను ప్రారంభించింది. పది రోజుల పాటు అందర్నీ ఉత్తరభారతంలోని పర్యాటక ప్రాంతాల్లో తిప్పి తీసుకు వస్తారు. పోలింగ్ రోజు నేరుగా ఓటింగ్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
కరీంనగర్, ఖమ్మం టీఆర్ఎస్‌లో టెన్షన్ ..టెన్షన్ !
ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీగా ఖర్చు పెట్టుకుని ఓటర్లను క్యాంపులకు తరలిస్తున్నారు. అక్కడ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఎమ్మెల్సీతో సహా బాలసాని లక్ష్మీనారాయణ, బొమ్మెర రామ్మూర్తి, గాయత్రి రవి వంటివారు టిక్కెట్ ఆశించినా కేసీఆర్ అనూహ్యంగా తాతా మధుకు కేటాయించారు. కేసీఆర్ డెసిషన్ గులాబీ శ్రేణులకు ఊహించని షాక్‌గానే చెప్పొచ్చు. టికెట్ ఆశించి భంగపడిన నాయకులంతా సీరియస్‌గా తీసుకోకపోతే టీఆర్ఎస్‌కు షాక్ తగిలినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం ముందు నుంచీ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచేంత బలం టీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటికీ ఒక్క ఓటు కూడా చేజారకుండా అధినాయకత్వం సూచనలతో ముందుచూపుతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను క్యాంపులకు పంపించారు. కరీంనగర్‌లోనూ టీఆర్ఎస్ రెబల్ సర్దార్ రవీందర్ సింగ్ బరిలో ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ ఓటర్లను క్యాంపులకు తరలించింది.
Also Read: CM KCR: యాసంగిలో ధాన్యం సేకరణ ఉండదు... వర్షకాలం పంటను ఎంతైనా కొంటాం... సీఎం కేసీఆర్ కీలక ప్రకటన...
టీఆర్ఎస్ క్యాడర్‌లో అసంతృప్తి హైకమాండ్ దృష్టికెళ్లినట్లేనా ?
ఖమ్మం, మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు, కరీంనగర్, ఆదిలాబాద్‌లో బీజేపీ పరోక్షంగా బలపరుస్తున్న అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్టీలో అంతర్గత విబేధాలు.. కొంత మంది పక్క చూపులు చూస్తూండటం వంటి కారణాలతో ఓటర్లను ముందస్తుగా క్యాంపులకు టీఆర్ఎస్ తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొంత అనుమానం ఉన్న ఓటర్లను పట్టుబట్టిక్యాంపులకు తరలిస్తున్నారు. ఏకగ్రీవం అవ్వాల్సిన ఎన్నికలను.. ఓటింగ్ దాకా రావడమే కాదు.. ఓట్లను కాపాడుకోవాల్సిన పరిస్థితిలో టీఆర్ఎస్ పడటం.. ఆ పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. సీఎం ఇలాకాలో ఎన్నడూ లేని విధంగా క్యాంపు రాజకీయం అనే కొత్త పదం వినిపిస్తోందంటూ ఆ పార్టీకి చెందిన కొందరు ఆశ్చర్యపోతున్నారు.
Also Read: TS Cabinet : ఒమిక్రాన్‌పై పోరుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ . ఆ ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి