MHA Announced Gallantary Medals: 'రిపబ్లిక్ డే' సందర్భంగా కేంద్ర హోం శాఖ (Ministry of Home Affairs).. పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డు, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీస్ పతకాలను ప్రకటించింది. ఈ మేరకు గురువారం అవార్డుల జాబితాను రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలను (Gallantary Awards) అందజేయనుంది. ఇందులో 275 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 753 మందికి పోలీస్ విశిష్ట సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఏటా రెండుసార్లు ఈ పోలీస్ పతకాలను ప్రకటిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో వీరికి
ఈ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల్లో 29 మందికి పతకాలు దక్కాయి. తెలంగాణ (Telangana) నుంచి 20 మంది.. ఏపీ నుంచి 9 మందికి పతకాలు ప్రకటించారు. ఏపీలో 9 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలు ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఆరుగురు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 12 మంది పోలీస్ విశిష్ట సేవా పతకాలు అందుకోనున్నారు. తెలంగాణ అదనపు డీజీలు సౌమ్యా మిశ్రా, దేవేంద్ర సింగ్ చౌహాన్ లకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు వరించాయి.
దేశవ్యాప్తంగా ఇలా
గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్న 277 మందిలో అత్యధికంగా జమ్మూ కశ్మీర్ నుంచి 72 మంది పోలీసులు, ఛత్తీస్ గఢ్ నుంచి 26 మంది, ఝార్ఖండ్ నుంచి 26, మహారాష్ట్ర నుంచి 18 మంది ఉన్నారు. సీఆర్పీఎఫ్ (CRPF) నుంచి 65 మంది, సశస్త్ర సీమాబల్ నుంచి 21 మందికి ఈ పురస్కారాలు వరించాయి. అలాగే, లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వరిస్తోన్న 119 మంది, జమ్మూ కశ్మీర్ లో పని చేస్తోన్న 133 మంది మెడల్స్ దక్కాయి.
గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
అటు, శుక్రవారం 75వ గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ (గతంలో రాజ్ పథ్) లో రిపబ్లిక్ డే పరేడ్ జరగనుంది. పరేడ్ లో సాయుధ బలగాలకు చెందిన 3 శాఖల బృందాలు చేసే కవాతు, ఆయుధాలు, సైనిక పరికరాల ప్రదర్శనలు, మోటార్ సైకిల్ విన్యాసాలు నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు విజయ్ చౌక్ నుంచి కర్తవ్య పథ్ వరకూ పరేడ్ సాగనుంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ను ఆహ్వానించారు. 72 వేల మంది పరేడ్ తిలకించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 42 వేల సీట్లను సాధారణ పౌరులకు కేటాయించారు. ఈ ఏడాది 'వీక్షిత్ భారత్', 'భారత్ - లోక్ తంత్రకి మాతృక' థీమ్ గా ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దిశగా భారత దేశ పాత్రను నొక్కి చెబుతోంది. మరోవైపు, వేడుకల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని 11 జోన్లలో 11 మంది డీసీపీలు, 8 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు.