Minister Tummala Announcement on Loan Waiver: రాష్ట్రంలో సంక్షోభం నుంచి సంక్షేమంలోకి వెళ్తున్నామని.. వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswararao) తెలిపారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల రుణమాఫీపై శుక్రవారం కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ఆర్థిక పరిస్థితి దిగజారినప్పటికీ.. రైతుల శ్రేయస్సుకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నామని.. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు. ఇందు కోసం ఆర్బీఐ, బ్యాంకులతో కలిసి విధి విధానాలు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. అలాగే, 2023 - 24 యాసంగికి సంబంధించి ఇప్పటివరకూ 64,75,819 మంది రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. 92.68 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమయ్యాయని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పై విమర్శలు
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై మంత్రి తుమ్మల విమర్శలు గుప్పించారు. 'గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఏడాది కూడా రైతుబంధు నిధులు 3 నెలల కంటే తక్కువ రోజుల్లో జమ చేయలేదు. 2018-19 వానాకాలంలో 4 నెలల 5 రోజులు, యాసంగిలో 5 నెలల 11 రోజులు, అలాగే 2019 - 20 వానాకాలంలో 4 నెలల 10 రోజులు, యాసంగిలో నెల 19 రోజులు, 2020 - 21 వానాకాలంలో 5 నెలల 16 రోజులు, యాసంగిలో 2 నెలల 24 రోజులు, 2022 - 23 వానాకాలంలో 2 నెలల 8 రోజులు, యాసంగిలో 4 నెలల 28 రోజులు, 2023 - 24 వానాకాలంలో 3 నెలల 20 రోజులు పట్టింది.' అని వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎప్పుడూ పంట పొలాలు సందర్శించలేదని.. కానీ, ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను రాజకీయం చేయడం తగదని.. అది బీఆర్ఎస్ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.