Revanth Reddy slams KTR in Phone Tapping Case- హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిన కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ‘బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాగుబోతులా మాట్లాడుతున్నారు. ఫోన్ల సంభాషణ వింటాం. వింటే ఏమవుతుందని సిగ్గు లేకుండా అంటున్నారు. అలా ఫోన్ సంభాషణ వింటే, చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడంటూ’ కేటీఆర్ కామెంట్లపై సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం: రేవంత్ రెడ్డి
కేసీఆర్ పాలనకు భిన్నంగా నేడు ప్రజలు సచివాలయానికి వెళ్లి సమస్యలు చెప్పే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోందని జోస్యం చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాకు డీకే ఆరుణ ఏం సాధించారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఏకం అయ్యారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు
Phone Tapping Issue: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గురువారం (మార్చి 28న) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇదివరకే ముగ్గురు కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. గురువారం మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, గట్టు మల్లును పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో వీరికి ఉన్న సంబంధంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల- కొంపల్లి లోని నాంపల్లి 14వ మెజిస్ట్రేట్ కన్యాలాల్ ముందు ఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ అయిన మాజీ డిసిపి రాధా కిషన్ ను పోలీసులు శుక్రవారం నాడు (మార్చి 29న) హాజరు పరిచారు.
ఇప్పటికే ముగ్గురు కీలక నిందితులు అరెస్ట్
అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు న్యాయమూర్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా నేతల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత విషయాలపై నిఘా పెట్టారని అభియోగాలున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆడియో రికార్డు చేసిన హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారని ఆరోపణలున్నాయి. ప్రణీత్ రావును విచారించగా.. అతను ఇచ్చిన సమాచారంతో మరికొందరి అరెస్టులు జరిగాయి. భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టులో ఇదివరకే వాదనలు ముగిశాయి. కానీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.