Minister Malla Reddy: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై జాతీయ నేతలతో పాటు తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు స్పందిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు ఖండిస్తున్నారు. అధికార బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ నేతలందరూ బాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించగా.. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. 


సోమవారం మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇందులో రాజకీయ కక్ష సాధింపు ఉందని అర్థమవుతుందని తెలిపారు. అంతేకాకుండా చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర కూడా ఉందని మల్లారెడ్డి ఆరోపించారు. వైసీపీ, బీజేపీ కలిసి కుట్ర చేసి చంద్రబాబును అరెస్ట్ చేశారని, కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా మాజీ సీఎంను అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఖచ్చితంగా దీని వెనుక బీజేపీ పాత్ర ఉందని, చంద్రబాబు అరెస్ట్ అన్యాయమన్నారు. 


అసలు ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమలు చేయడంలో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా చేస్తున్న ఆందోళనలకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని, ప్రతిఒక్కరూ ఖండించాల్సిన విషయమని అన్నారు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల చేయాలని పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారని, వారికి తాను మద్దతు తెలుపుతానన్నారు. చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి విడుదల అవుతారని ఆశిస్తున్నట్లు మల్లారెడ్డి పేర్కొన్నారు.


ఖండించిన తెలంగాణ నేతలు


చంద్రబాబు అరెస్ట్‌ను ఇప్పటికే తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు ఖండించారు. బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖండించగా.. బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ ఖండించారు. ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి చంద్రబాబు అరెస్ట్‌‌ను తప్పుబట్టారు.


బాబుకు జాతీయ నేతల మద్దతు


చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, నేనషల్ కాన్పరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్ధుల్లా వంటి కీలక నేతలు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. ఇక సోమవారం బాబు అరెస్ట్‌పై ఎండీఎంకే కీలక నేత వైగో స్పందించారు మాజీ సీఎంను అరెస్ట్ చేయడం దారుణమని, చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని అన్నారు. ఎలాంటి విచారణ చేపట్టకుండా అరెస్ట్ చేయడం అక్రమమని, సమన్లు జారీ చేసి విచారణ జరపొచ్చని వ్యాఖ్యానించారు.