Minister KTR: తెలంగాణలో కాంగ్రెస్‌కే వారంటీ లేదని, వారు గ్యారెంటీ హామీలు ఇస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండల కేంద్రం, లింగన్నపేట, కోళ్లమద్ది, నర్మాల గ్రామాల్లో నిర్మించిన 378 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బుధవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేసి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాళేశ్వరం నీటితో సిరిసిల్లలో నీటి ఎద్దడి పరిష్కారమైందన్నారు. గంభీరావుపేటలోని కేజీ టు పీజీ క్యాంపస్ విద్యార్థులతో ఇంగ్లిషులో మాట్లాడడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, దేశంలో ఎక్కడాలేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వారెంటీ అయిపోయిందని, దానిని చెట్టబుట్టలో వేశారని అన్నారు. వారంటీ లేని వాళ్లు గ్యారెంటీ ఇచ్చేందుకు రాష్ట్రానికి వస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ తన 65 ఏళ్ల కాలంలో నీళ్లు, కరెంటు, పింఛన్లు ఇవ్వలేకపోయిందని, పేదలకు ఏ రూపంలోనూ సహాయం చేయలేదన్నారు. పని చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఓ ఆరు పనులు జరుగుతాయని కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 1. రైతులు కరెంటు కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. 2. నీటి కోసం ట్యాంకర్ల ముందు ప్రజలు పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. 3. ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడాలన్నారు. 4.ప్రతి సంవత్సరం సీఎం మారతారని సటైర్ వేశారు. 5 గ్రామ పంచాయతీలు కుగ్రామాలుగా మారుతాయన్నారు. 6. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో ఉండదని అన్నారు. ఏదో ఒకటి చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.
జిల్లాలో తన పర్యటనలు తక్కువ అయ్యాయని ఎవరూ తిట్టుకోవద్దని కేటీఆర్ కోరారు. రైతులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో గొప్పగొప్ప ఆలోచనలు చేశారని అన్నారు. జనాన్ని గందరగోళానికి గురిచేయడమే కాంగ్రెస్ పార్టీ పని అని అన్నారు. వారంటీ లేని ఆ పార్టీ గ్యారంటీలు ఇస్తే ప్రజలు నమ్ముతారా? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచేందుకు తాను మందు పోయనని, పైసలు ఇవ్వనని, ఇలా చెప్పే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల దేశ చరిత్రలో రైతుల ఖాతాల్లో 73 వేల కోట్ల రూపాయలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. రైతు బీమా కింద చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.
కాంగ్రెస్ రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో 4,000 పింఛన్లు ఇవ్వడం లేదని, కానీ తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.4,000 పింఛన్లు ఇస్తామంటూ ఈ వాగ్ధానాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను ఏ పనీ చేయలేదని సిరిసిల్లలోని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, నిధులన్నీ సిరిసిల్లకు తీసుకువెళ్తున్నానని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కొంత మంది నాయకు డబ్బులు వెదజల్లేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చే డబ్బు తీసుకుని బీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించాలని పిలుపునిచ్చారు.