Minister KTR on BJP: బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఎవరూ చేయని విధంగా వంద లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని తెలిపారు. అన్ని కోట్లు అప్పులు చేసినప్పటికీ... దేశానికి ఉపయోగపడేలా ఒక్క పని అయినా చేశారా అంటూ ప్రశ్నించారు. అయితే అప్పుగా తెచ్చిన ఆ డబ్బును ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలని అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం మంత్రులు, ప్రతినిధులతో కలిసి మంత్రి స్విట్జర్లాండ్ లోని దావోస్ కు చేరుకున్నారు. ప్రవాస భారతీయులు మంత్రి కేటీఆర్ కు ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. సంక్రాంతి సంబురాలకు ఆహ్వానించగా.. వెళ్లిన మంత్రి వారితో తెగ ఎంజాయ్ చేశారు.
ఈ క్రమంలోనే ఎన్ఆర్ఐలతో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... అభివృద్ధి కోసం లాభాలు ఆర్జించే రీతిలో పెట్టుబడి పెట్టేందుకు అప్పులు చేయడంలో తప్పులేదని చెప్పారు. కానీ పెట్టుబడులతో ప్రతీ పైసా లాభంతో తిరిగొస్తుందన్నారు. అయితే తెచ్చిన అప్పులను ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు. గతంలో 14 మంది ప్రధానులు చేసిన అప్పులు 56 లక్షల కోట్లు అయితే ప్రధానిగా మోదీ ఒక్కరు చేసిన అప్పులే 100 లక్షల కోట్లు అని వివరించారు. అన్ని కోట్ల అప్పులు చేసినప్పటికీ దేశానికి ఉపయోగపడేలా ఒక్క పని కూడా చేయకపోవడం బాధాకరం అన్నారు. అంతే కాకుండా ఆ అప్పులతో ఏమైనా అభివృద్ధి పనులు చేస్తే చెప్పాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సర్కారు చేసే ప్రతీ పైసా అప్పుకు ప్రతిఫలం ఉందని మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ అప్పులను ప్రశ్నించే అర్హత బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ ఉందని నిలదీశారు. తెలంగాణ అప్పులపై బీజేపీ కావాలనే నానా యాగీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి తీసుకొచ్చిన సొమ్మును బీఆర్ఎస్ సర్కారు పెట్టుబడులపై, రాష్ట్ర అభివృద్ధిపై ఖర్చు చేసిందన్నారు. దీని ప్రతిఫలాలు ఇప్పటికే అందుకుంటున్నామన్నారు. ముందుముందు మరిన్ని లాభాలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్జిస్తుందని మంత్రి కేటీఆర్ వివరించారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్..
ప్రపంచ ఆర్థి వేదిక సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరు కావడం ఇది మొదటి సారి ఏం కాదు. గతంలో 2018, 2019, 2020, 2022 సంవత్సరాల్లో జరిగిన సదస్సుల్లో కూడా ఆయన పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ ఈ సదస్సులో పాల్గొంటే ఐదోసారి అవుతుంది. ఈసారి భిన్న ప్రపంచంలో సహకారం అనే నినాదంతో సదస్సు జరుగుతోంది. ఇందులో మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేస్తారు. అనంతరం జరిగే చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు. పారిశ్రామిక సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. పెట్టుబడులు, పరిశ్రమల సాధనకు పలు అవగాహన ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు.