KTR America Tour : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ కెమ్ వేద ముందుకు వచ్చింది. శాండియాగోలోని సంస్థ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేసింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రముఖ పరిశోధన సంస్థగా కెమ్ వేద కంపెనీకి పేరు ఉంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ,ఆగ్రో కెమికల్, పరిశ్రమలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మరింతగా విస్తరించేందుకు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్టు సంస్థ తెలిపింది. కేవలం 45 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ ఈ రోజు 450 మందికి చేరిందని, దీనిని మరింతగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ కు తెలిపింది. 8 ఎకరాల్లో రెండు చోట్ల తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, తమ కంపెనీని ఇంత భారీగా విస్తరించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాలసీలు అక్కడ ఉన్న నాణ్యమైన మానవ వనరులు ప్రధాన కారణాలని తెలిపింది. 


హైదరాబాద్ నగరం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఫార్మా లైఫ్ సైన్సెస్ పెట్టుబడులకు ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్న కెమ్ వేద లైఫ్ సైన్సెస్ కంపెనీ కి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఫార్మా లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టంలో ఉన్న మానవ వనరులు అవకాశాలను ఉపయోగించుకొని ప్రత్యేకంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ కార్యకలాపాలకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఫార్మా లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఈకో సిస్టంను ఈ డెవలప్మెంట్ సెంటర్ మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ తెలిపారు.


హైదరాబాద్ లో తమ కంపెనీ వేగంగా విస్తరిస్తుందని, ఫార్మా లైఫ్ సైన్సెస్ వృద్ధిలో భాగస్వాములు కావడం సంతోషాన్ని ఇస్తుందని కంపెనీ అధ్యక్షులు, సీఈఓ బీమా రావు పారసెల్లి తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ సుమారు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అత్యంత నైపుణ్యం కలిగిన  500 మంది  హై స్కిల్ల్డ్ నిపుణులకు పరిశోధన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో తమ కంపెనీని మరింత విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి  జయేష్ రంజన్ , డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.


మంత్రి కేటీఆర్ కు శాన్ డియాగో లో ఘన స్వాగతం


తన పర్యటనలో భాగంగా తొలి రోజు సమావేశాల కోసం అమెరికాలోని శాన్ డియాగోలో అడుగు పెట్టిన మంత్రి కేటీఆర్ కి స్థానికంగా ఉన్న తెలుగు ఎన్నారైలు తెలంగాణ ఎన్నారైలు భారీ ఎత్తున స్వాగతం పలికారు.  శాన్డియాగోలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాల గురించి వారిని అడిగి మంత్రి తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్ తమ నగరంలో పర్యటించడం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు.


ఫార్మా యూనివర్సిటీలో భాగం కావాలని స్క్రిప్స్ కోరిన మంత్రి కేటీఆర్ 


హైదరాబాద్ ఫార్మాసిటీలో ఏర్పాటుచేయబోయే ఫార్మా యూనివర్సిటీలో భాగం కావాలని ప్రఖ్యాత పరిశోధన సంస్థ స్క్రిప్స్ ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. పాఠ్యాంశాల రూపకల్పన, బోధనా సిబ్బంది, విద్యార్థుల మార్పిడి, జాయింట్ రీసెర్చ్, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల రూపకల్పనలో స్క్రిప్స్ తన భాగస్వామ్యాన్ని అందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇవాళ శాండియాగోలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, స్క్రిప్స్ పరిపాలక సభ్యులైన డా. జేమ్స్ విలియమ్సన్ , మేరీవాంగ్, డాక్టర్. అర్నాబ్ ఛటర్జీ, ప్రొఫెసర్ సుమిత్ చందాలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేస్తున్న ఫార్మాసిటీ వివరాలను వారితో కేటీఆర్ పంచుకున్నారు.




లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ లో ఉన్న అపార అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లో తమ కార్యాలయాలు ఏర్పాటుచేయడం, ఫార్మా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను కేటీఆర్ చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని అనుకూలతలు ఒక్క తెలంగాణకు మాత్రమే ఉన్నాయని మంత్రి కేటీఆర్ స్క్రిప్స్ బృందానికి తెలిపారు. సైన్స్ పరిశోధనల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సంస్థగా స్క్రిప్స్ రీసెర్చ్ కు పేరుంది.  2,400 మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది తో పాటు 200 కంటే ఎక్కువ ప్రయోగశాలలు ఈ సంస్థకు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్, లాభాపేక్షలేని బయోమెడికల్ పరిశోధన సంస్థ ఇది. ఈ సంస్థకు చెందిన ఐదుగురికి ప్రఖ్యాత నోబెల్ బహుమతులు వచ్చాయి. స్క్రిప్స్ సంస్థకు దాదాపు 1,100 పేటెంట్లు ఉన్నాయి.  FDA-ఆమోదిత 10 చికిత్సా విధానాలను కనుగొనడంతో పాటు 50కి పైగా స్పిన్-ఆఫ్ కంపెనీలను స్క్రిప్స్ ఏర్పాటుచేసింది.