కరోనా వేళ గర్భిణిల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. గర్భిణిలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యం అందించేలా ఏర్పాట్లు చేసింది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన గర్భిణిల కోసం అన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీరితో పాటు కరోనా సోకిన ఇతర బాధితులకు అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సలు అందించేందుకు కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, వార్డు కేటాయించాలని ఆదేశించింది. మంగళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాసరావులతో కలసి అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌వోలు, టీచింగ్ ఆసుపత్రి సూపరింటెండెంట్లు, యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీల వైద్యాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల సన్నద్దత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... కోవిడ్ పాజిటివ్ వచ్చిన గర్భిణిలకు అన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని, దీనికి అనుగుణంగా ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక ఆపరేషన్ థియేటర్, వార్డు ప్రత్యేకంగా కేటాయించాలని ఆదేశించారు.
అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని కోవిడ్ సోకిందని చికిత్స అందించేందుకు నిరాకరించవద్దని, వారి కోసం కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, వార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్యాధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేయాలని, పరిస్థితులను తెలుసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అన్ని ఆసుపత్రులకు అసవరమైన వైద్య పరికరాలను అందించడం జరిగిందని, అవి పూర్తి వినియోగంలో ఉండేలా చూడాలన్నారు.
ఆదివారం బస్తీ దవాఖానాలు
కరోనా ప్రభావం తగ్గే వరకు బస్తీ దవాఖానాలు, పీహెచ్ సీలు, సబ్ సెంటర్లు ఆదివారం కూడా పని చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వ్యాక్సినేషన్, పరీక్షలు, హోమ్ ఐసొలేషన్ కిట్ల పంపిణీ జరగాలన్నారు. లక్షణాలతో ఎవరు వచ్చినా పరీక్ష చేసి, లక్షణాలు ఉంటే కిట్ ఇచ్చి పంపాలన్నారు. కేంద్రం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతీ పీహెచ్ సీలో రాత్రి పదింటి వరకు వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పీహెచ్సీలో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. కరోనా వచ్చి సాధారణ లక్షణాలు ఉన్నవారికి కిట్లు ఇవ్వడంతో పాటు, వారి ఆరోగ్య పరిస్తితిని తెలుసుకోవాలని సూచించారు. అవసరమైతే వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని చెప్పారు.
Also Read: Covid Updates: తెలంగాణలో కొత్తగా 1920 కరోనా కేసులు, ఇద్దరు మృతి... 16 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
వాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలి
వాక్సినేషన్ లో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ వాక్సిన్ రెండు డోసులు ఇవ్వాలని, అందుకు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన మున్సిపల్ సిబ్బంది, పోలీసులు, ఇతర విభాగాలకు వంద శాతం బూస్టర్ డోస్ పూర్తి చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్వోలు కలెక్టర్లతో మాట్లాడి మున్సిపల్ సిబ్బంది, పోలీసులందరికీ వంద శాతం బూస్టర్ డోస్ వేసేలా సమన్వయంతో పని చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పీహెచ్ సీ పరిధిలో రెండో డోస్ పెండింగ్ లో ఉండవద్దని, పీహెచ్ సీ వైద్యులే బాధ్యత తీసుకుని రెండో డోస్ వందకు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.