Minister Harish Rao: కాంగ్రెస్ నాయకులంతా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత తెలంగాణకు వచ్చి మాట్లాడాలంటూ సూచించారు. కాంగ్రెస్ గెలిస్తే 6 నెలలకు ఓ సీఎం మారతారంటూ సెటైర్లు వేశారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం శంకరంపేటలో వంద డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మొత్తం 350 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్లాట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ... పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసి, ఆత్మగౌరవంతో జీవించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. పేద ప్రజలకు ఇళ్లు, ప్లాట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే కచ్చితంగా చేస్తాడని చెప్పుకొచ్చారు. నారాయణ్ ఖేడ్ లో ఇచ్చిన హామీ మేరకు... అన్నీ చేసి చూపించాడన్నారు. అలాగే పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వందలాది మందికి సొంతింటి కలను నిజం చేశారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
కాంగ్రెస్ వాళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ప్రస్తుతం 600 రూపాయల పింఛన్ ఇస్తున్నారని.. విద్యుత్తు అంతరాయాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వికలాంగులకు 1000, రైతు బంధువులకు 10 వేలు ఇస్తున్నామని కాంగ్రెస్ చెబుతున్నదంతా అవాస్తవం అని పేర్కొన్నారు. అధికారంలోకి రావాలని తెలంగాణలో నోటికి వచ్చి హామీలు ఇస్తున్నారని చెప్పారు. కాళేశ్వరానికి నీళ్లు ఇస్తాం, శంకరంపేటలో ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తాం అని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 నెలల్లో హామీలు అమలు కావని.. కానీ ఆరు నెలలకు ఒక కొత్త సీఎం మాత్రం ఉంటాడని ఎద్దేవా చేశారు. 6 నెలల పాటు కర్ఫ్యూ, 6 గంటలు మాత్రమే కరెంట్ ఉంటుందంటూ విమర్శించారు. ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకమాండ్ అవుతుందని.. వారానికి రెండు పవర్ హాలిడేలు ఉంటాయని చెప్పారు. తెలంగాణకు రెండో రాజధానిగా బెంగళూరును తీర్చిదిద్దనున్నారంటూ వ్యాఖ్యానించారు. బెంగళూరు మీదుగా ఢిల్లీ వెళ్లాలని అన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పిన సీఎం కేసీఆర్.. హామీని నెరవేర్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హామీలు సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటివని చెప్పుకొచ్చారు
త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల అవుతుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ కోసం పోరాడి చావు అంచుల దాకా వెళ్లి మరీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించగలిగారని వివరించారు. అలాగే భూపాల్ రెడ్డి మంచి నాయకుడు అని... నిత్యం ఆయన ప్రజల్లోనే ఉంటారని తెలిపారు. ప్రజలంతా బీఆర్ఎస్ కు ఓటేసి భూపాల్ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు.
Read Also: బీజేపీతో ఎలాంటి డీల్ లేదు, ముస్లింల వల్లే రాహుల్ గెలుపు-అసదుద్దీన్ ఓవైసీ