ఇండియా కూటమిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. I.N.D.I.A కూటమిలో చేరేది లేదన్న ఆయన, ఇప్పటికే కూటమికి ఊపిరి ఆడటం లేదన్నారు. బీజేపీ ఐడీయాలజీకి వ్యతిరేకంగా ఎందుకు పని చేయడం లేదన్న అసదుద్దీన్, ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా హిందువుల ఓట్లు మాత్రం కూటమి అభ్యర్థులకు రావని స్పష్టం చేశారు. బీజేపీతో తనకు ఎలాంటి డీల్ లేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారని, వయ్‌నాడ్‌లో గెలుపొందారని గుర్తు చేశారు. వయ్‌నాడ్‌లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారని, అందుకే రాహుల్ గెలుపొందారని అన్నారు.
విపక్ష ఇండియా కూటమిలో చేరిక కోసం తనను ఆహ్వానించకపోవడంపై ఏఐఎంఐఎం చీఫ్ , ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇండియా కూటమిలో చేరాలని తమ పార్టీని ఆహ్వానించకపోవడాన్ని పట్టించుకోనన్నారు. విపక్ష కూటమిలో కేసీఆర్‌తోపాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో పలు పార్టీలు భాగస్వాములు కాలేదని గుర్తుచేశారు. ఇండియా కూటమిలోని లౌకిక పార్టీలు చెప్పుకునే పార్టీలు తమను రాజకీయంగా అంటరానివారిగా చూస్తున్నాయని విమర్శించారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు చొరవ చూపాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరానన్నారు అసదుద్దీన్ ఓవైసీ. కేసీఆర్ ఈ దిశగా ముందుకువస్తే... దేశంలో నెలకొన్న రాజకీయ శూన్యతను భర్తీ చేయవచ్చన్నారు. గతంలోనూ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఓవైసీ కోరారు. కేసీఆర్ చొరవ తీసుకుంటే పలు రాజకీయ పార్టీలు, నేతలు ఆ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
గాడ్సే, సావర్కర్ బిడ్డలను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని రెండ్రోజుల క్రితం వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌కు చరిత్ర లేదని, బీజేపీ కొత్త సృష్టి అని అన్నారు. మజ్లిస్‌కు అనుకూలంగా మాట్లాడే అర్హత వారికి లేదని ఓవైసీ స్పష్టం చేశారు. జాకార్లుగా ఉన్నవారు పాకిస్థాన్‌కు పారిపోయారని, విశ్వాసపాత్రులైన వారే ఇక్కడ పోరాడుతున్నారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడ్డ ఇండియా కూటమికి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు దూరంగా ఉంటున్నాయి. ఇప్పటికే రెండు, మూడుసార్లు భేటీ అయిన ఇండియా కూటమి, ఈ రెండు పార్టీలకు మాత్రం ఆహ్వానం పంపలేదు. ఈ క్రమంలో అసదుద్దీన్ చేసిన థర్డ్ ఫ్రంట్ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.