Kalvakuntla Kavitha: కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును (Women Reservation Bill) పార్లమెంటులో ప్రవేశపెడుతుండడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంతోషం వ్యక్తం చేశారు. దీన్ని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. లోక్ సభలో తాము పూర్తిగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలుకుతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తెస్తున్నందుకు సంతోషంగా ఉందని కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం కోసం కేంద్ర కేబినెట్ ఆమోదించడంపై కవిత స్పందించారు. ఈ మేరకు ఆమె హైదరాబాద్‌లో సోమవారం (సెప్టెంబర్ 18) రాత్రి 10.30 గంటల సమయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లులో (Women Reservation Bill) ఇంతకుముందు పేర్కొన్న అంశాలే ఉన్నాయా? లేక పూర్తిగా మార్పులు చేసిన బిల్లును ప్రవేశపెడుతున్నారా? అని కవిత (Kalvakuntla Kavitha) ప్రశ్నించారు. గతంలో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లులోని అంశాలే ఇందులో కూడా ఉన్నాయా లేదా అనే దానిపై తమకు స్పష్టత కావాలని అన్నారు. చట్టసభల్లోకి మరింత మంది మహిళలు రావాలని కవిత ఆకాంక్షించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని గతంలో సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారని కవిత గుర్తు చేశారు. తాను కూడా చొరవ తీసుకొని ఈ బిల్లు కోసం పోరాడానని కవిత (Kalvakuntla Kavitha) అన్నారు.
కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రధాని మోదీ అధ్యక్షతన సాయంత్రం 6:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాగా, రెండు గంటలకు పైగా సాగింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే చట్టసభల్లో (పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలు) మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి వీలు కలుగుతుంది. దీంతో రేపు (సెప్టెంబరు 19) కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభం కాబోయే సమావేశాల్లో తొలి బిల్లుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లునే ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంటు సమావేశాలను పాత భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనానికి తరలించేందుకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది. అంతేకాక, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయని సమావేశాలకు ముందు ప్రధాని మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్ర కేబినెట్ సమావేశానికి ముందే వీరితో మోదీ భేటీ
సోమవారం (సెప్టెంబర్ 18) కేంద్ర కేబినెట్ సమావేశానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంత్రులతో సమావేశమయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి క్యాబిన్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, వి మురళీధరన్ హాజరయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి.