నూతన పార్లమెంటుకు వెళ్లే ముందు ఈరోజు ఉభయ సభల సభ్యులు పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పార్లమెంటు భవనంతో పాటు, సెంట్రల్‌ హాల్‌కు సంబంధించిన విషయాలను గుర్తుచేసుకున్నారు. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ సెంట్రల్‌ హాల్‌ సాక్షిగా నిలిచిందని అన్నారు. బ్రిటన్‌ నుంచి భారత్‌కు అధికార బదిలీకి ఈ హాలే సాక్షమని పేర్కొన్నారు. మన రాజ్యాంగం ఇక్కడే రూపుదిద్దుకుందని అన్నారు. 1952 నుంచి ఇక్కడ దాదాపు 42 మంది దేశాధ్యక్షులు ప్రసంగించారని గుర్తుచేశారు. రాష్ట్రపతులు ఇక్కడ 86సార్లు తమ ప్రసంగాలను వినిపించారని తెలిపారు.


సెంట్రల్‌ హాల్‌తో ఎమోషనల్‌గా ఎంతో ముడిపడి ఉన్నామని, అలాగే ఇది ఎంతో స్ఫూర్తినింపిన ప్రదేశమని అన్నారు. నూతన పార్లమెంటులోకి మారడానికి ఇదే సమయమని, ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. చిన్న కాన్వాస్‌పై పెద్ద బొమ్మ గీయలేమని, ఇప్పుడు పెద్ద కాన్వాస్‌పై చిత్రీకరించాల్సిన సమయం వచ్చిందని, భారత్‌కు పెద్ద విజన్‌ అవసరమని మోదీ వెల్లడించారు. భారత దేశం గ్లోబల్‌ సౌత్‌ వాయిస్‌గా ఎదుగుతోందని అన్నారు. ప్రపంచం మనలో విశ్వామిత్రుడిని చూస్తోందని తెలిపారు. ప్రజల ఆంకాక్షలు పెరుగుతున్నాయని, అందుకు తగినట్లుగా మనం ముందుకు సాగాలని మోదీ పేర్కొన్నారు.


పాత పార్లమెంటు.. సంవిధాన సభ


కొత్త పార్లమెంటు భవనంలోకి మారినంత మాత్రాన పాత భవనం గౌరవం ఏమాత్రం తగ్గకూడదని, ఈ భవనాన్ని సంవిధాన సభగా పిలవాలని మోదీ తెలిపారు. ఈ పార్లమెంటు భవనంలో ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించామని, దీని వల్ల ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ట్రాన్స్‌జెండర్స్‌కు, ప్రత్యేక అవసరాలున్న వారికి న్యాయం జరిగేలా మనమంతా కలిసి చట్టాలను ఆమోదించామని అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసే అవకాశం మనకు దక్కిందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచే  నాలుగు వేలకు పైగా చట్టాలను ఆమోదించుకున్నామని తెలిపారు.  ఇలా ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ పార్లమెంటు సాక్షిగా నిలిచిందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న భారత్‌కు పరిష్కారంగా కొత్త భవనంలోకి అడుగులు వేద్దామని మోదీ పేర్కొన్నారు. 


ఈరోజు కొత్త సంసద్‌ భవన్‌ను కొత్త ఆశలతో వెళ్తున్నామని, ప్రజలకు మనపై చాలా అంచనాలు ఉన్నాయని, దీంతో మన బాధ్యత మరింద పెరుగుతోందని, అందుకు తగినట్లుగా మనం ఉండాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సెంట్రల్‌ హాల్‌లో మాట్లాడుతూ  అన్నారు. 


పాత పార్లమెంటు భవనం వద్ద ఈరోజు ఫొటో సెషన్‌ జరిగింది. పార్లమెంటు సభ్యులు, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఫొటోలు దిగారు. చివరగా పాత పార్లమెంటులో ప్రధాని మోదీ ఎంపీలకు అభివాదం చేశారు. తర్వాత పాత భవనానికి వీడ్కోలు పలికి ప్రధాని మోదీని అనుసరిస్తూ ఎంపీలు అందరూ కొత్త పార్లమెంటు భవనంలోకి నడుచుకుంటూ వెళ్లారు. అందరూ వందే మాతరం, భారత్‌ మాతా కీ జై అంటూ నినాదాలతో నూతన భవనంలోకి అడుగుపెట్టారు. దీంతో ప్రాంగణమంతా సందడిగా మారింది. కొత్త పార్లమెంటు భవనానికి పార్లమెంటు హౌస్‌ ఆఫ్‌ ఇండియా గా నామకరణం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది.