హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం రంగంలోకి దిగిన ట్రబుల్ షూటర్ మంత్రి హరీశ్ రావు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై ఆయన విమర్శలు, ఆరోపణలు ఆపడం లేదు. ఈ క్రమంలోనే సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌లో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన నేతల్లో ఉత్సాహం నింపారు. కళాకారులు పాడిన పాటలకు ఉత్సాహంతో స్టెప్పులు వేశారు.
తాజాగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఈటల రాజేందర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఈటలకు ఎంతో గౌరవం ఇచ్చిందని, ఒక్క సీఎం పదవి తప్ప అన్ని పదవులు ఆయనకు కల్పించిందని చెప్పారు. కానీ, ఈటల వ్యవహారం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల.. హుజూరాబాద్ ప్రజలకు బొట్టు బిళ్లలు, కుట్టు మిషన్లు ఎందుకు పంచుతున్నారని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో చేనేత కార్మికులకు ఆర్థిక ఆసరా నిమిత్తం చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
తమది పనిచేసే ప్రభుత్వం అని, బీజేపీ నేతలవి వట్టి మాటలేనని చెప్పారు. బీజేపీ నేతలు తెలంగాణ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని హరీశ్ రావు విమర్శించారు. హరీశ్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా కమలాపూర్‌లో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలోనూ పాల్గొన్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును నడుపుతూ అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ వెళ్లారు.
డాన్సు వేసిన మంత్రి హరీశ్ రావు
మరోవైపు, కమలాపూర్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం సందర్భంగా కళాకారుల ధూమ్ ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా’ అనే పాటకు మంత్రి హరీశ్ రావు డాన్సు చేశారు. గులాబీ జెండా ఊపుతూ ఎదురుగా ఉన్న కార్యకర్తలను ఉత్సాహపర్చారు. ఎమ్మెల్యే బాల్క సుమన్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి కూడా హరీశ్ రావుతో డ్యాన్స్ చేసిన వారిలో ఉన్నారు. కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉన్న ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.
Also Read: Sai Dharam Accident Update: సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ ఎఫెక్ట్.. భారీ జరిమానా వేసిన జీహెచ్ఎంసీ
Also Read: Nalgonda: ఇంట్లో ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన కోడలు.. చూసేసిన మామయ్య, చివరికి దారుణం
Also Read: హుస్సేన్‌సాగర్‌ని కాలుష్యం చేయమని మేం చెప్పలేం.. నిమజ్జనంపై తీర్పును సవరించేది లేదు..