మెదక్ జిల్లాలో ధర్మాకర్ శ్రీనివాస్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొలుత వివాహేతర సంబంధం ఈ హత్యకు కారణమని ప్రచారం జరగ్గా అది కారణం కాదని పోలీసులు తేల్చారు. ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని పోలీసులు ధ్రువీకరించారు. దాదాపు రూ.కోటిన్నర డబ్బులు ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. ఈ ఆర్థిక లావాదేవీల్లో ధర్మాకర్ శ్రీనివాస్‌కు, మెదక్‌కు చెందిన మరో వ్యక్తికి మధ్య విభేదాలు తలెత్తినట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తానికి నిందితులను గుర్తించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.


కత్తితో పొడిచి హత్య


ధర్మాకర్ శ్రీనివాస్‌ను నిందితులు కారులోనే కత్తితో పొడిచి చంపినట్లుగా మెదక్ జిల్లా పోలీసులు గుర్తించారు. దాదాపు ఆరు గంటల పాటు ఆ కారులోనే రోడ్లపై వారు తిప్పినట్లు తెలుస్తోంది. ముగ్గురు వ్యక్తులు కలిసి సాక్ష్యాలను మాయం చేసేందుకే కారు డిక్కీలో శవాన్ని ఉంచి, ఆ కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, వారు లోన్ తీసుకొని శ్రీనివాస్‌కు అప్పు ఇచ్చినా.. ఆయన తిరిగి ఇవ్వలేదని అందుకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.


ఈ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. సీసీటీవీ కెమెరాలు, ఫోన్ కాల్ డేటా సాయంతో పోలీసులు అసలు విషయాన్ని గుర్తించారు. మొత్తం కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ చందనా దీప్తి అభినందించారు.


Also Read: TS High Court Verdict: చెల్లెలికి అన్న కిడ్నీ ఇవ్వొచ్చు, అలాంటి భార్య పర్మిషన్ అక్కర్లేదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు


ఏం జరిగిదంటే..
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో ఓ కారు మంటల్లో కాలిపోయి ఉంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలిపోయిన కారు సమీప గ్రామస్థుల కంట పడడంతో వారు పరిశీలించగా.. డిక్కీలో కాలిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తుప్రాన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చుట్టుపక్కల పరిశీలించారు. కారు మొత్తం కాలిపోవడంతో నెంబరు కూడా కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు కారు ఇంజిన్ నెంబరు ఆధారంగా రిజిస్ట్రేషన్ నెంబరును కనిపెట్టారు. దీంతో ఆ కారు మెదక్‌లోని ఓ వ్యాపారికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.


వెంటనే నిందితులు ఎవరనే అంశం మాత్రం తెలియరాలేదు. తొలుత వివాహేతర సంబంధాలు కారణమని అనుకున్నారు. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కావడంతో రాజకీయ కక్షలు కారణమని అనుకున్నారు. కానీ, ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని పోలీసుల విచారణలో తేలింది.


Also Read: Huzurabad By-Election: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ప్రకటించిన కేసీఆర్.. ఇంతకీ ఎవరాయన?