ఎన్నికల ప్రచారంలో దుండగుడి దాడిలో కత్తిపోట్లకు గురై యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి క్రమంగా కోలుకుంటున్నారు. తాను బాగానే ఉన్నానని, వారం రోజుల్లోనే ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. 'భగవంతుడి దయ, నియోజకవర్గ ప్రజల ప్రేమాభిమానాలు, మీ అందరి ఆశీస్సులతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డా. ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నా. నన్ను చూసేందుకు అభిమానులు ఎవరూ హైదరాబాద్ రావొద్దు. వారం రోజుల్లో నేనే ప్రజల ముందుకు వస్తా.' అంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు.





ఇదీ జరిగింది


ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై అక్టోబర్ 30న దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఓ దుండగుడు ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఎంపీ పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఓ ఫాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా కరచాలనం చేసేందుకు వచ్చిన వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఎంపీకి తీవ్ర గాయాలు కాగా భద్రతా సిబ్బంది, ఆయన అనుచరులు గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ఎంపీకి శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు 10 రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. నిందితుడు మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. ఎంపీకి షేక్ హ్యాండ్ ఇస్తానని చెప్పి ఈ దాడికి పాల్పడ్డాడు. కత్తితో కడుపులో పొడిచాడు. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు నిందితున్ని చితకబాదారు. కర్రలతో కొట్టి, కాళ్లతో తన్నారు. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.


పాపులారిటీ కోసమే


సంచలనం కోసమే మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై నిందితుడు రాజు దాడి చేశాడని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. నిందితుడికి ఎవరి సహకారం లేదని, ఒక్కడే హత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు. వారం రోజుల కిందట నిందితుడు రాజు కత్తి కొనుగోలు చేసి ఎంపీ హత్యకు ప్లాన్ చేశాడని వెల్లడించారు. పథకం ప్రకారమే ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశారని సీపీ చెప్పారు. నిందితుడు పలు వెబ్‌ఛాన్సల్‌లో పనిచేస్తున్నాడని చెప్పారు. విలేకరి అని చెప్పుకొంటూ, ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసి జల్సాలకు వాడుకునే వాడని తెలిపారు. వీటికి సంబంధించి రాజుపై ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు. 


కాగా, ఎంపీపై దాడిని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆయన్ను పరామర్శించారు. మంత్రి హరీష్ దగ్గరుండి ఆయన వైద్య సేవలను పర్యవేక్షించారు. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 


Also Read: బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ ప్రజల్ని నమ్మించగలదా ? కొత్తగా చేరిన నేతలు, క్యాడర్ కలిసిపోతారా ?