Telangana Election 2023 : తెలంగాణలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. దాదాపుగా అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని ప్రచార బరిలోకి దిగారు. అధికార పార్టీ మూడు నెలల ముందుగానే అభ్యర్థుల్ని ఖరారు చేసి ప్రచారబరిలోకి దిగింది. కేసీఆర్ రోజుకు రెండు , మూడు సభల్లో పర్యటిస్తున్నారు. కానీ పదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీకి .. వారి పాలనే ప్రచారం కానీ.. ఎన్నికల ముందు పెట్టే సభలు కాదు. కానీ ప్రతిపక్ష పార్టీకి అలా కాదు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి. వారికి ఇప్పుడు ప్రచారం జోరుగా చేయాల్సిన అవసరంతో పాటు... అత్యధికంగా ఫిరాయింపుదార్లకు ఇచ్చిన టిక్కెట్లు.. ఆ విషయంలో క్యాడర్ లో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించుకోవడంతో పాటు ఓటర్లను బూత్ వరకూ రప్పించుకోవాల్సి ఉంది.
గెలుపు గుర్రాల పేరుతో ఫిరాయిందార్లకు టిక్కెట్లు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల పేరుతో చాలా మందిని పార్టీలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చింది. టిక్కెట్లు ఖరారైన నేతలు డోర్ టు డోర్ ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మొదటి సమస్య వస్తోంది. ఇరవై శాతం సీట్లలో పక్క పార్టీల నుంచి వచ్చిన వారు అభ్యర్థులు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారు అభ్యర్థులు. కాంగ్రెస్ కార్యకర్తలు నిన్నామొన్నటి వరకూ వారిపైనే పోరాడారు. ఇప్పుడు వారంతా తాము ఎవరిపై పోరాడామో ఆ నేతలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఇది ఇబ్బందికరం కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ ఎలా స్పందిస్తుందన్నది కీలకం. ఇప్పటికే చాలా చోట్ల ద్వితీయశ్రేణి నేతలు పార్టీ మారుతున్నారు. నిజానికి అలా కాంగ్రెస్ లోకి వచ్చే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఆయారాం.. గయారాంలు అన్నమాట.
క్యాడర్ కలుస్తారా ?
ప్రాంతీయ పార్టీల్లో ఉండే నాయకత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోగలదు కాబట్టి బీఆర్ఎస్ ప్రచారంలో ముందు ఉందన్న ఊపు కనిపిస్తుంది. కానీ ప్రతిపక్షానికి అలా కాదు.. తాము ప్రత్యామ్నాయం అని ప్రచారం ద్వారానే ప్రజలకు నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తి స్థాయిలో టీమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా చేరిన నేతలు.. పాత నేతలు అందరూ.. బీఆర్ఎస్ ను ఓడించాలన్న లక్ష్యంతోనే అడుగు ముందుకు వేస్తున్నారు. దీంతో వారి ప్రయత్నలోపాలు ఉండకపోవచ్చు. కానీ అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగడమే ఇప్పుడు కీలకం. పార్టీల్లో బలమైన నేతల్ని ఆహ్వానిస్తున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా... వీరంతా ఒకరి నాయకత్వాన్ని అంగీకరిస్తారా లేదా అన్నది కూడా కీలకమే. అలాంటి యాక్సెప్టెన్సీ ఉంటుందని ప్రజలకు నమ్మకం కలిగించాలి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇస్తున్న కొన్ని సూచనలు కొంత వరకు వర్కవుట్ అవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. కానీ ఓటింగ్ సమయం దగ్గర పడే కొద్దీ.. పూర్తిగా మెరుగుపడితేనే మేలు
ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్లడమే కలకం !
ఓటింగ్ కు వెళ్లే ప్రజల మైండ్ సెట్ భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని కొనసాగించాలన్నా... ఓడించాలన్న బలమైన కోరిక ప్రజల్లో ఉండి ఉంటే... ఆటోమేటిక్ గా ఓటింగ్ శాతం పెరుగుతుంది. అందులో సందేహం ఉండదు. కానీ.. ప్రతిపక్ష పార్టీలు ఇక్కడే యాక్టివ్ గా ఉండాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని ఓటు వేసేలా ప్రోత్సహించాలి. ఇందు కోసం టీమ్ వర్క్ .. దిగువస్థాయి నుంచి జరగాలి. లేకపోతే గెలుపు ముందు బోర్లా పడతారు. ఓటింగ్ ఉంటే కాదు..దాన్ని ఈవీఎంలలో నమోదు చేయించుకోవడం అసలు విషయం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తాము ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్న వారితో పోటీ పడుతున్నామన్న సంగతిని కూడా లెక్కలోకి తీసకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై కోపం వస్తే ప్రజలకు తమకు ఓటేస్తారు అని విపక్షాలు కులాసాగా ఉండే రాజకీయాలు పోయాయి. ఇప్పుడు తామే ప్రత్యామ్నాయం అని ప్రతిపక్షాలు ప్రజలకు నిరూపించాల్సిన రాజకీయం వచ్చింది. ఈ విషయంలో కాంగ్రెస్ అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది.