హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు..?.  ఎప్పుడో ఎవరికీ తెలియదు. ఖాళీ అయిన ఆరు నెలల్లో  ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగ నిబంధన. అందుకే రాజకీయ పార్టీలన్నీ ఆరు నెలలైనా సరే యుద్ధం చేయడానికి రంగంలోకి దిగిపోయాయి. బీజేపీ తరపున ఈటల పాదయాత్ర చేస్తున్నారు. టీఆర్ఎస్ తరపున మంత్రులు... మండలాల వారీగా ఇంచార్జులుగా బాధ్యతలు తీసుకుని.. అందరికీ గులాబీ కండువాలు కప్పే పనిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా  చార్జ్ తీసుకుని .. కొన్ని వర్గాలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ప్రిపరేషన్స్ ప్రారంభించింది. కానీ ఉపఎన్నిక మాత్రం ఆరు నెలల్లో జరిగే అవకాశం లేదని ఢిల్లీలో నుంచి సంకేతాలు అందుతున్నాయి. 


హుజూరాబాద్‌లో నేడో రేపో ఉపఎన్నిక అన్నంతగా పార్టీల పాట్లు..! 


ఈటల రాజేందర్ బీజేపీ పెద్దలను కలిసి హైదరాబాద్ తిరిగి వచ్చి రాజీనామా చేసి.. ఆ తర్వాత మళ్లీ ఢిల్లీకి వెళ్లి పార్టీలో చేరారు. తర్వాతి రోజు నుంచే హుజూరాబాద్‌లో ప్రచారం మొదలు పెట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కావడంతో...  వెంటనే ఉపఎన్నికలు పెట్టాలన్న వ్యూహంతోనే ఇలా రాజీనామా చేసి..ఈటల రంగంలోకి దిగారన్న అభిప్రాయానికి అందరూ వచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ పెద్దలు ఏం ఆలోచించారో కానీ... జాతీయ సమీకరణాలు ఇప్పుడు హుజూరాబాద్‌పై పడుతున్నాయి.  ఉపఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతోంది. 


ఉత్తరాఖండ్ సీఎంతో రాజీనామా చేయించిన బీజేపీ..!


ఉత్తరాఖండ్ సీఎంగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్‌ను.. సీఎం పదవి చేపట్టి మూడు నెలలు కాకుండానే  రాజీనామా చేయించేశారు. ఆయన ఎంపీనే.. ఎమ్మెల్యే కాదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే చాన్స్ లేదు అందుకే రాజీమామా చేయిస్తున్నాం.. అని కారణం చెప్పారు. నిజానికి ఉత్తరాఖండ్‌లో రెండు ఎమ్మెల్యే స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి మరో మూడు నెలల సమయం త్రివేంద్రసింగ్ కు ఉంది. కానీ ఎన్నికలు పెట్టే అవకాశం లేదన్న కారణంగా రాజీనామా చేయించేశారు. కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని భారత ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు సరిగ్గా అమలు చేయనందున కేసులు ఎందుకు పెట్టుకూడదని ప్రశ్నించింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై ఈసీ బాగా ఫీలయింది. కరోనా పూర్తి స్థాయిలో తగ్గిన తర్వాతే ఎన్నికలు పెట్టాలని డిసైడయింది. బీజేపీ కూడా ఇదే చెబుతోంది. కరోనా కారణంగా ఎన్నికలు పెట్టరు కాబట్టి రాజీనామా చేయించేశామని చెబుతోంది. 


మమతా బెనర్జీ పదవి ఊడగొట్టేందుకేనా.. 


నిజంగా బీజేపీ తల్చుకుంటే ఉత్తరాఖండ్‌లో ఉపఎన్నికలు పెట్టడం పెద్ద విషయం కాదు. కానీ.. పెట్టదల్చుకోలేదు. దానికి కారణం... తాము అతి పెద్ద ప్రత్యర్థిగా భావిస్తున్న మమతా బెనర్జీని దెబ్బకొట్డడం. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఆరు నెలల్లో అసెంబ్లీకి లేదా మండలికి ఎన్నిక కావాల్సి ఉంది. బెంగాల్‌లో మండలి లేదు. ఇక శాసనసభకే ఎన్నిక కావాలి. తన పాత నియోజకవర్గం భవానీపూర్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించారు. ఉపఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ ఉపఎన్నిక జరగకపోతే ఆమె రాజీనామా చేయాల్సిందే మరో ఆప్షన్ లేదు. నవంబర్‌లోపు ఆమె అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది.  ఉత్తరాఖండ్ సీఎంతో రాజీనామా చేయించిన తర్వాత బీజేపీకి ఉపఎన్నికలు పెట్టే ఉద్దేశం లేదని మమతా బెనర్జీకి అర్థమైపోయింది. అందుకే ఆమె శాసనమండలిని పునరుద్ధరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించారు. కానీ మండలిని పునరుద్ధరించాలన్నా కేంద్రం చేతుల్లోనే ఉంది. 


అక్కడ పెట్టలేని ఉపఎన్నిక హుజూరాబాద్‌లో ఎలా పెడతారు..? 


ఉపఎన్నికల కేంద్రంగా మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ అన్నట్లు సాగుతున్న ఈ వ్యవహారంలో హుజూరాబాద్‌ అంశం కూడా ఇరుక్కుపోయింది. కరోనా కారణగా బెంగాల్‌లో.. ఉత్తరాఖండ్‌లో ఉపఎన్నికలు నిర్వహించకపోతే.. దేశంలో ఎక్కడా నిర్వహించే అవకాశం లేదు. అలా నిర్వహిస్తే ఎస్‌ఈసీ విశ్వసనీయతమీదే విమర్శలు వస్తాయి. ఒక్క హుజూరాబాద్ మాత్రమే కాదు ఏపీలో బద్వేల్ ఎమ్మెల్యే మార్చిలో కరోనా కారణంగా చనిపోయారు. అక్కడా ఉపఎన్నిక నిర్వహించాలి. అక్కడ నిబంధనల ప్రకారం మరో నెలరన్నలో ఎన్నికలు నిర్వహించాలి. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ మమతా బెనర్జీని రాజకీయంగా ఓడించే లక్ష్యంతో  ఉన్న బీజేపీకి...  ఉపఎన్నికలను లైట్ తీసుకుంటోంది. 


ఐదు రాష్ట్రాల ఎన్నికలతో కలిసి ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ..! 


పంజాబ్, యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగాల్సి ఉన్నాయి. అవి నిర్వహించక తప్పదు. అప్పుడే  మిగిలి ఉన్న ఉపఎన్నికలను కూడా నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ.. మమతా బెనర్జీ విషయంలో వ్యూహం మార్చుకోకపోతే.. హుజూరాబాద్ ఉపఎన్నిక కూడా అప్పుుడే జరుగుతుంది. కానీ బీజేపీ వ్యూహం ఏమిటో అర్థం కాక..  చాన్సివ్వకూడదన్న ఉద్దేశంతో కేసీఆర్ కంగారు పడుతున్నారు. ఇతర పార్టీలూ హడావుడి పడుతున్నాయి. కానీ ఉపఎన్నిక మాత్రం వచ్చే ఏడాది మాత్రమే జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది.