Teenmar Mallanna Bail : తీన్మార్ మల్లన్నకు హైదరాబాద్ మల్కాజ్ గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు.... ఒక్కొక్కరికి రూ.20 వేలు పూచీకత్తు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రేపు తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదల కానున్నారు. తీన్మార్ మల్లన్నకు రెండు కేసుల్లో సాధారణ బెయిల్ ఇచ్చింది కోర్టు.  బెయిల్ కోరుతూ తీన్మార్ మల్లన్న మల్కాజ్ గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు... తుది తీర్పును ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అదేవిధంగా ఏప్రిల్12న రెండో కేసు బెయిల్ పిటిషన్ పై మల్లన్న న్యాయవాది కోర్టుకు వివరాలు సమర్పించారు. అదే రోజు బెయిల్ పై ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే బెయిల్ పై తుది తీర్పును ఏప్రిల్ 17న ఇస్తామని గతంలో కోర్టు తెలిపింది. దీంతో ఇవాళ తుది తీర్పు ఇచ్చారు న్యాయమూర్తి.  తీన్మార్‌ మల్లన్నపై తెలంగాణ వ్యాప్తంగా 90 కేసులు పెట్టారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా తన భర్తను అరెస్ట్‌ చేశారని మల్లన్న భార్య మమత ఏప్రిల్‌ 3న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 


జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను మార్చి 21న పోలీసులు అరెస్టు చేశారు. అంతకు రెండు రోజుల ముందు కొందరు గుర్తుతెలియని దుండగులు తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీసుపై దాడులు చేసి విధ్వంసం సృష్టించడం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 21 రాత్రి 9 గంటల సమయంలో కొందరు పోలీసులు క్యూ న్యూస్ కార్యాలయం నుంచి తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్జాదిగుడాలోని మల్లన్న Q న్యూస్ ఆఫీస్ పోలీసులు సోదా చేశారు. ఆఫీసులోని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఇతర డివైజ్ లు తీసుకెళ్లిపోయారు. పోలీసులు వచ్చిన సమయంలో సిబ్బందిని బయటకు పంపించి వేసినట్లు సమాచారం. ఎవరినీ క్యూ న్యూస్ ఆఫీసులోకి అనుమతించలేదు.  


నిర్బంధించి దాడి చేశారని ఫిర్యాదు 


 జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను అరెస్ట్ చేసిన అనంతరం మేడిపల్లి పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచ్చారు. తీన్మార్ మల్లన్నపై ఐపీసీ సెక్షన్లు 148, 307, 342, 506, 384, 109, r/w 149 కింద కేసులు నమోదు చేసినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని విడుదల చేశారు. తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురు నిందితులకు అప్పట్లో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.  అనంతరం తీన్మార్ మల్లన్నను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. సాయికరణ్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తీన్మార్ మల్లన్న కుటుంబసభ్యుల డిమాండ్ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని మేడిపల్లి పోలీసులు విడుదల చేశారు. క్యూ న్యూస్ సిబ్బంది తనను నిర్బంధించి దాడి చేశారని సాయికరణ్ ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు తీన్మార్ మల్లన్నతో పాటు ఆయన టీమ్ నలుగురిని అరెస్ట్ చేసినట్లు మేజిస్ట్రేట్ కు తెలిపారు.