YS Viveka Case : వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల నుంచి తనకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో దస్తగిరి మీడియాతో మాట్లాడారు. వివేకా కుమార్తె సునీత, సీబీఐ అధికారుల నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. గతంతో డబ్బుకు ఆశపడి ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు చేశామన్నారు. ఇప్పుడు తనకు డబ్బు అవసరంలేదని అందుకే సీబీఐకి నిజం చెప్పానన్నారు. తనపై ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారంతా... నేను అప్రూవర్‌గా మారినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మీ వరకు రానంత వరకు దస్తగిరి మంచోడు, ఇప్పుడు చెడ్డవాడా? అని ప్రశ్నించారు. చేతిలో అధికారం ఉందని సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ను మార్చేశారని దస్తగిరి ఆరోపించారు. సీబీఐ అధికారిని మార్చితే కొత్త బృందం కొత్త కోణంలో విచారిస్తుందా? అని నిలదీశారు.  


నేనెక్కడికీ పారిపోను 


వివేకా హత్య కేసులో ఎవరి పాత్ర ఏంటో సీబీఐకి తెలుసని, ఆ విధంగానే దర్యాప్తు చేస్తు్న్నారని దస్తగిరి అన్నారు. తాను తప్పు చేశాను కాబట్టే ఇప్పుడు బాధపడి, తప్పు ఒప్పుకున్నానని చెప్పుకొచ్చారు. తాను తప్పు చేస్తే జైలుకు వెళ్తానన్నారు. పులివెందుల వైఎస్‌ జయమ్మ కాలనీలోనే ఉంటున్నాని, తానెక్కడికీ పారిపోవడంలేదన్నారు. సీఎం జగన్, అవినాష్ రెడ్డి తప్పుచేసినట్లు రుజువైతే రాజీనామా చేస్తారా? అని దస్తగిరి ప్రశ్నించారు. 


ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నుంచి పిలుపు


వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. సీబీఐ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలని పేర్కొంది. అయితే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను తెలంగాణ  హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. పిటిషన్‌పై మంగళవారం ఉదయం విచారణ చేపట్టనున్నారు. అందుకే పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకూ అవినాష్ రెడ్డిని విచారణకు పిలవవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత అవినాష్ రెడ్డిని ప్రశ్నించవచ్చని తెలిపింది. ఇప్పటికే ఉదయం పదిన్నరకు రావాలని సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కానీ హైకోర్టు ఆదేశంతో  ఆ నోటీసులు క్యాన్సిల్ చేసి మరోసారి సాయంత్రం నాలుగు గంటలకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. 


సీబీఐకి భయపడే దస్తగిరి స్టేట్మెంట్ 


వైఎస్ భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.. హైకోర్టులో భాస్కర్‌రెడ్డి పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే సీబీఐ అరెస్ట్ చేసిందని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎంపీ తరఫు న్యాయవాది వాదించారు.  భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడానికి దస్తగిరి కాంఫెషన్ తప్ప ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరిని సీబీఐ బెదిరించినట్టు, చిత్రహింసలకు గురిచేసినట్టు ఎర్ర గంగిరెడ్డి చెప్పారు. దస్తగిరి సీబీఐకి భయపడి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అవినాష్ రెడ్డి సహ నిందితుడు అంటూ ప్రచారం జరుగుతోంది.. దస్తగిరికి బెయిల్ వచ్చిన తర్వాతి రోజే సీబీఐ వాళ్ళు 306 పిటిషన్ వేశారన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆయన్ను అప్రూవర్‌గా మార్చారు. హత్యకు సంబంధించిన ఆధారాలు లేవని అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదించారు.