Telangana News: తెలంగాణలో మావోయిస్టులు తమ వ్యూహం మార్చారా, తెలంగాణలో కీలక నేతలను హతమార్చేందుకు పావులు కదుపుతున్నారా.. అందుకే మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారా అనే ప్రశ్నలు ఇప్పుడు పోలీసులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇటీవల ములుగు జిల్లా తాడ్వాయి మండలం వీరాపూర్‌ అడవుల్లో  మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదుగురుకాల్పులు జరిగినట్టు సమాచారం. సెంట్రీ అప్రమత్తతో మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల యాక్షన్‌టీం కమాండర్‌ భద్రు, మణుగూరు ఏరియా కమాండర్‌ మంతు, జనార్దన్‌ దళాలు 20 రోజులుగా తాడ్వాయి అరణ్యంలో సంచరిస్తున్నట్టు నిఘావర్గాలు పసిగట్టాయి. సమాచారం అందుకున్న స్పెషల్‌ పార్టీ, గ్రేహౌండ్స్‌ బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. వీరాపూర్‌ అటవీ ప్రాంతంలో దళాలు సేద తీరుతున్న సమయంలో పోలీసుల రాకను గమనించిన సెంట్రీ అప్రమత్తమయ్యాడు. వెంటనే సాయుధ మావోయిస్టులు డెన్‌ను ఖాళీ చేసే క్రమంలో నిత్యావసరాలు, సామగ్రిని వదిలేసి వెళ్లారు. 


పోలీసులు సమీపంలోకి రావడంతో నక్సల్స్ కాల్పులు


కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు అతి సమీపంలోకి రావడంతో నక్సల్స్‌ కాల్పులు ప్రారంభించారని, అలర్ట్ అయిన పోలీసులు కూడా ఫైరింగ్‌కు దిగారని సమాచారం. సుమారు 15 నిమిషాల పాటు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు తెలిసింది. అనంతరం మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించిన పోలీసులు అక్కడ లభ్యమైన సామగ్రిని స్వాధీన పర్చుకున్నట్టు తెలుస్తోంది. ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశం ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దులో ఉంటుంది. ఫైరింగ్‌ అనంతరం మావోయిస్టులు పరారు కాగా వారు వెళ్లే అన్నిదారుల్లో పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడవుల్లో కూంబింగ్‌ చేయడంతోపాటు వాహన తనిఖీలు, గస్తీలు చేపడుతున్నారు. అయినా సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌ అడవుల నుంచి ములుగు వైపు మావోయిస్టులు ఎలా.. ఎప్పుడు వచ్చారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మావోయిస్టులు ఆశ్రయం పొందుతారనే అనుమానంతో గొత్తికోయ గూడాలను తనిఖీ చేస్తున్నట్టు తెలుస్తోంది.


ఇటీవల కొన్ని ఎన్ కౌంటర్‌ లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. తాడ్వాయి, ఏటూరు నాగారం, కొత్తగూడ, గంగారం, బయ్యారం అడవుల్లో కూంబింగ్  నిర్వహిస్తున్నారు. ఏజెన్సీలోని ఆదివాసీ గూడాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. మాజీ మావోయిస్టులపై పోలీసులు నిఘా పెట్టారు. దీంతో ఏజెన్సీ గిరిజన గ్రామాలు భయాందోళనలో ఉన్నాయి. ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టులపై పోలీసులు రివార్డ్ ప్రకటించారు. 8 మంది మావోయిస్టులపై రూ. 5 లక్షల నుంచి ఇరవై లక్షల వరకు రివార్డ్ ప్రకటించారు. తప్పించుకున్న మావోయిస్టుల ఫైల్ ఫోటోలు విడుదల చేశారు. అలాగే ఇల్లందు, నర్సంపేట ఏరియా కమిటీలతో పాటు డీకేఏఎస్ఆర్ డివిజన్ కమిటీలు మావోయిస్టు నేత దామోదర్ డైరెక్షన్ లో సమావేశం అయినట్లు పోలీస్ ఇంటలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఇటు మావోయిస్టులు అటు పోలీసులు చర్య ప్రతి చర్యల వల్ల ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనతో కాలం వెల్లదిస్తున్నారు స్థానికులు.