Warangal News: ఆ అధికారులు చట్టసభల్లో అడుగు పెట్టాలని తహతహ లాడుతున్నారట. ఈసారి చాలామంది సీట్లు మార్పు తప్పదనే ప్రచారం ఒకవైపు.. రిజర్వేషన్లు మరోవైపు ఊరిస్తుండడంతో ఛాన్స్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అధినేత చెవిన పడేలా చక్రం తిప్పుతున్న లీడర్ కమ్ ఆఫర్స్... ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రజాసేవలో తమ తడాఖా చూపుతామంటున్నారట. ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టిలో పడ్డ ఆ అధికారులకు అవకాశం తలుపు తట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇంతకీ ఎవరా అధికార ఘనులు...? ఎక్కడి బరిలో దిగడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు..? వాచ్ దిస్ ABP దేశం స్పెషల్ స్టోరీ.


పవర్ ఉంటే చాలు..!


పవర్.. పవర్.. పవర్ ఉంటే ఎలాంటి వారినైనా శాశించవచ్చు. ఏదైనా సాధించ వచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకైనా, ప్రైవేటు ఉద్యోగులకైనా కొన్ని పరిధులు ఉంటాయి. కానీ పవర్ చేతిలో ఉంటే ఎమైనా సాధించవచ్చు. అదే ధీమాతో ప్రభుత్వ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి ఎంతోమంది ప్రజాప్రతినిధులు అయినవారు ఉన్నారు. అలాంటి వారు రాజకీయాల్లో రాణించాలంటే అవకాశాలు దక్కాలి. రిజర్వేషన్లు కలిసి రావాలి. ఈ నేపథ్యంలోనే కొందరు అధికారులు రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకొని చట్టసభల్లో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నా రు.


కొన్ని నియోజకవర్గల్లో మార్పు తప్పదు..


ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశావాహుల సంఖ్య పెరిగిపోతుంది. అలాంటి వారిలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులు, జిల్లా స్థాయి అధికారులు రిజర్వేషన్ స్థానాల్లో అవకాశం దక్కించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యంగా ములుగు జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు వరంగల్ కు చెందిన ఓ పోలీస్ ఉన్నతాధికారి అధినేత అనుగ్రహం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.


జిల్లాలో అదే చర్చ?


ఈ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్యతో పాటు ఇదే జిల్లాకు చెందిన ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న మేడారం ప్రధాన పూజారి సిబ్బబోయిన జగ్గారావు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే తాపత్రయంతో వఉన్నారట. మరో మహిళా ఫారెస్ట్ అధికారిని కూడా అధినేత అనుగ్రహిస్తే చట్టసభల్లోకి రావడానికి సిద్ధమని ఆశావాహుల జాబితాలో చేరారు. ఎందుకంటే ములుగు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ స్థానం. ఈ అధికారులకు ఎస్టీ రిజర్వేషన్లు కలిసొస్తుండడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తపిస్తున్నారట. 


వరంగల్ పార్లమెంట్ లో అదే పరిస్థితి?


మరోవైపు వరంగల్ పార్లమెంట్ స్థానంపై కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు ఆశలు పెంచుకున్నట్లు సమాచారం. వారిలో ప్రస్తుతం నిజామాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వహిచి ఇటీవల పదవీ విరమణ చేసిన నాగరాజుకు కూడా అవకాశం కలిసొస్తే రంగంలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుగుణాకర్ రాజు కూడా స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ స్థానంపై గంపెదంత ఆశతో ఉన్నారు.


భూపాలపల్లి నియోజకవర్గంలో అదే పరిస్థితి


మరోవైపు భూపాలపల్లి స్థానంపై రాంనర్సింహారెడ్డి అనే ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి కూడా విపరీతంగా ఆశలు పెంచుకున్నారు. ఇప్పటికే కేఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన ప్రత్యేకతను చాటాలనుకుంటున్న ఆయన.. అధినేత అనుగ్రహిస్తే ప్రజాసేవలో తరిస్తారణని ఇప్పటి నుండే ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు.


ఆంధ్రప్రదేశ్ లో గోరంట్ల మాధవ్ ఆదర్శంగా తీసుకుని


అంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ లాంటి నేతలను ఆదర్శంగా తీసుకుంటున్న ఈ అధికారులు ఎలాగైనా చట్టసభల్లో అడుగు పెట్టాలనే కుతూహలంతో ఉన్నారు. పైగా ఈసారి మెజార్టీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పదని ప్రచారం జరుగుతుండడంతో ఆశావాహుల సంఖ్య పెరిగి పోతుంది. మనసులో మాట వారి సన్నిహితులతో చెప్పి గులాబీ బాస్ చెవిన పడేలా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.