Asifabad Tribal Woman Incident: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో జరిగిన ఘటనపై అందరూ సంయమనం పాటించాలని అదనపు డి.జి. (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ అన్నారు. గురువారం ఐ.జి. చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల ఎస్.పి. లు అశోక్ కుమార్, అఖిల్ మహాజన్, గౌస్ ఆలం, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, బాలానగర్ డి.సి.పి. సురేష్ కుమార్ లతో కలిసి జైనూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో, అటు ఉట్నూర్ లోని కుమ్రంభీం కాంప్లెక్స్ లో ఆదివాసి పెద్దలతో వేరువేరుగా జైనూర్ ఘటనపై సంయమనం పాటించాలని కోరుతూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు డి.జి. (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ మాట్లాడుతూ... కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసి మహిళపై దాడి జరగడం బాధాకరమని, ఆదివాసి యువత, ప్రజలు, ముస్లిం సోదరులు ఈ ఘటనపై సమయమనం పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని తెలిపారు. బాధిత మహిళలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, వైద్య చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, కుటుంబ సభ్యులు సహకరించాలని తెలిపారు. ఈ ఘటనలో జరిగిన ఆస్తి నష్టంపై పూర్తిస్థాయి నివేదిక అందించేందుకు కాగజ్ నగర్ డి.ఎస్.పి. కరుణాకర్ ను ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందని, జరిగిన నష్టంపై పారదర్శకమైన నివేదిక అందించాలని, తద్వారా బాధితులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటన సంబంధిత విషయంపై పెద్దల సూచనలు, సలహాలు స్వీకరించి ప్రజా ఉపయోగకర చర్యలు తీసుకుంటామని, ఆదివాసీలు, ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని తెలిపారు.
ఈ సందర్భంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ... బాధిత మహిళపై లైంగిక వేధింపులు, హత్యాయత్నానికి పాల్పడిన సందర్భంలో తుడుం దెబ్బతో సహా ఆదివాసీ సంస్థలు బంద్ పిలుపునివ్వగా బంద్‌ను బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు 2 వర్గాలతో చర్చించడం జరిగిందని తెలిపారు. ఒక్కసారిగా పరిస్థితి 2 వర్గాల మధ్య ఘర్షణగా మారి ఆదివాసీలు ఇతర వర్గాల ఆస్తులపై దాడి చేయడంతో ఇతర వర్గాల నుండి ప్రతీకార చర్యగా దహనం, రాళ్లు రువ్వడం, ఆస్తుల నష్టం మొదలైన వాటికి దారితీసిందని, ఈ నేపథ్యంలో జిల్లా ఎస్.పి. తన బృందంతో మొదట స్పందించి, పొరుగున ఉన్న ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలు, టి.జి.ఎస్.పి. ప్లాటూన్‌ల నుండి అదనపు బలగాలతో తన శాయశక్తులా ప్రయత్నించారని, పొరుగు జిల్లాల ఎస్.పి.లు/డి.సి.పి.లు కూడా పరిస్థితిని అదుపు చేయడంలో తమ సహకారం అందించారని తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మొత్తం 1000 మందికి పైగా పోలీసులను మోహరించారని, ఆర్.ఎ.ఎఫ్. మోహరింపబడుతోందని, రాష్ట్ర డి.జి.పి., ఎ. డి. జి. (లా & ఆర్డర్), నార్త్ జోన్ ఐ.జి. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, నిషేధిత కర్ఫ్యూ ఆదేశాలు 144 సి.ఆర్. పి.సి. / 163 బి.ఎన్.ఎస్.ఎస్. జిల్లా యంత్రాంగం జారీ చేసిందని, నిషేధాజ్ఞలను ఉల్లంఘించవద్దని తెలిపారు.
పుకార్లు, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌పై నిషేధాన్ని అమలు చేయడం జరుగుతుందని, ప్రభావిత ప్రాంతంలో నిషేధాజ్ఞల ప్రకటనతో పాటు ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారని, ఆత్మవిశ్వాసం నింపేందుకు పికెట్లు పెడుతున్నారని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దహనం, హింసాత్మక ఘటనలపై దర్యాప్తు ప్రారంభించి నేరస్తులను గుర్తించి చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హింస సమయంలో జరిగిన ఆస్తి నష్టం అంచనా వేయబడుతుందని, తదుపరి అవసరమైన చర్య కోసం ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని, హత్యాయత్నంతో లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే నిందితులను జైనూర్ పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినందున అందరూ సంయమనం పాటించాలని కోరారు.
గాంధీ ఆసుపత్రిలో బాధితురాలికి వైద్య చికిత్స కొనసాగుతోందని, అన్ని చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, బాధితురాలికి ఇప్పటికే 1 లక్ష రూపాయల పరిహారం అందించడం జరిగిందని తెలిపారు. వదంతులను నమ్మవద్దని, ఎలాంటి నిజం లేకుండా రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్ట్‌లను ప్రసారం చేస్తే శిక్షార్హమైన చర్య తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి కోసం ప్రజలు డయల్ 100ని సంప్రదించవచ్చని తెలిపారు.