Severe Situations Due To Vijayawada Floods: కళ్ల ముందే నీటిలో మునిగిపోతున్న నలుగురిని కాపాడబోయిన ఓ వ్యక్తి.. కుటుంబం ఆకలి తీర్చేందుకు వెళ్లిన ఓ ఇంటి పెద్ద.. కొడుకు కోసం తాగునీరు తెచ్చేందుకు వెళ్లిన ఓ తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇవీ విజయవాడలో (Vijayawada) వరద మిగిల్చిన విషాద గాథలు. బుడమేరు వాగు ఎందరి జీవితాలనో చిన్నాభిన్నం చేసింది. ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహం నగరంలోని ప్రాంతాలను ముంచేసింది. ఏం జరుగుతుందో తేరుకునే లోపే కొందరు మృత్యువాత పడగా.. మరికొందరు ఎలాగో తేరుకుని తమ ప్రాణాలు దక్కించుకున్నారు. భవనాల పైకెక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. గంటల కొద్దీ ఆహారం, నీరు లేక అలమటించారు. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టడంతో బాధితులకు కాస్త ఉపశమనం లభించింది.
నలుగురిని కాపాడి..
విజయవాడ వరదల్లో (Vijayawada Floods) నలుగురిని కాపాడిన ఓ వ్యక్తి.. అనంతరం వరదలో కొట్టుకొకుపోతున్న 50 ఆవులను రక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్(32)కు సింగ్ నగర్‌లో ఓ డెయిరీ ఫాం ఉండగా.. ఆయనతో పాటు ఇద్దరు సోదరులు, మరో ఇద్దరు యువకులు డెయిరీ ఫాంలో పని చేస్తున్నారు. ఆదివారం ఒక్కసారిగా వరద పోటెత్తగా.. నీటిలో కొట్టుకుపోతున్న సోదరులతో పాటు ఇద్దరు యువకులను కాపాడి డెయిరీ ఫాం పైకప్పు వద్దకు చేర్చాడు. అనంతరం తాళ్లతో కట్టి ఉంచిన ఆవులను రక్షించేందుకు వెళ్లి.. అవి ప్రాణాలతో ఉంటాయని భావించి తాళ్లు విడదీశాడు. ఆ తర్వాత ఈదుకుంటూ వచ్చి పైకప్పు ఎక్కేందుకు ప్రయత్నించగా కాలు జారి కింద పడడంతో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. డెయిరీ ఫాంకు 500 మీటర్ల దూరంలో చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. కాగా, ప్రస్తుతం చంద్రశేఖర్ భార్య 8 నెలల గర్భిణీ. తమను కాపాడి కళ్ల ముందే అన్న కొట్టుకుపోయాడంటూ సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు.
కొడుకు దాహం తీర్చాలని..
విజయవాడ రూరల్ మండలం అంబాపురంవాసి తగరం శ్యాంబాబు (50) వించిపేటలో ఓ చర్చి ఫాదర్‌గా పని చేస్తున్నారు. వరద ముంచెత్తడంతో అంబాపురం ఆరో లైనులోని శ్రీకర్ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో కుటుంబ సభ్యులతో చిక్కుకుపోయారు. ఆదివారం నుంచి తాగునీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుమారుడు దాహంగా ఉందనడంతో చలించిన తండ్రి తాగునీటి కోసం సోమవారం బయటకు వచ్చి నీటిలో మునిగిపోయారు. మంగళవారం అతని మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
అటు, విజయవాడ రాజీవ్ నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి కుప్పల దుర్గారావు ఆదివారం ఉదయం బుడమేరు వద్ద ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి వరద ముంచెత్తడంతో రెండు గంటలు అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉంటే వరద పెరిగిపోతుందని భావించి ఎలాగైనా ఇంటికి వెళ్లిపోవాలని భావించి బయటకు రాగా ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. మంగళవారం కుమారుడి మృతదేహాన్ని గుర్తించిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అలాగే, పాయకాపురం ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో ఆటో డ్రైవర్ కట్టా సారంగం (22) కుటుంబం నివసిస్తోంది. బుడమేరు వరదలో పూర్తిగా ఇల్లు నీట మునగగా.. ఆదివారం నుంచి ఆహారం లేక అలమటించారు. సోమవారం సమీపంలో ఆహార పొట్లాలు అందిస్తున్నారని తెలిసి బయటకొచ్చాడు. వరద తీవ్రతకు నీటిలో మునిగిపోయాడు. మంగళవారం మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, రాష్ట్రంలో వరదల కారణంగా 32 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 24 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారు.