Khairatabad Ganesh News: హైదరాబాద్‌లో వినాయకచవితి రోజు కొలువుదీరనున్న ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం పనులు పూర్తి అయ్యాయి. అదే ప్రదేశంలో విగ్రహాన్ని తయారు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 7న వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి తొలి పూజ జరగనున్న సంగతి తెలిసిందే. అందుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. విగ్రహం పనులు ఎప్పుడో పూర్తి కాగా.. రంగులు అద్దడం కూడా కళాకారులు పూర్తి చేశారు. ఆఖరి ఘట్టంగా గణనాథుడి కళ్లను నేడు రూపొందించారు. విగ్రహంపైన నేత్రాలను శిల్పి రాజేందర్ తీర్చిదిద్దారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో బడా గణేష్ దర్శనం జరగనున్న సంగతి తెలిసిందే.


ఈసారి 70 అడుగుల ఎత్తైన శ్రీసప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహాన్ని ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించనున్నారు. ఖైరతాబాద్ విగ్రహం నెలకొల్పి ఈ ఏడాదికి 70 ఏళ్లు నిండనున్నాయి. అందుకని 70 అడుగుల విగ్రహాన్ని ఈసారి ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహ ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేందర్ నేతృత్వంలో దాదాపు 200 మంది కార్మికులు ఈ 70 అడుగుల విగ్రహాన్ని పూర్తి చేశారు.  గురువారం ఉదయం 10 గంటలకు ప్రధాన శిల్పి స్వామివారికి నేత్రాలంకరణ చేశారు. ఇక మొత్తం విగ్రహ పనులు పూర్తి కావడంతో చుట్టూ నిర్మాణం  కోసం ఏర్పాటు చేసిన కర్రలను కూడా తొలగిస్తామని ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ వెల్లడించారు.




రేవంత్ రెడ్డికి ఆహ్వానం
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పూజలకు ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన వారు వినాయక నవరాత్రి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్చకులు ఆశీర్వచనం అందించారు.


భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే ద్వారా ఆహ్వానం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ చైర్మన్ దానం నాగేందర్ ఆహ్వానించారు. ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఆయన కోరారు. ప్రజాభవన్ లో పూజారులు, ఉత్సవ మండలి సభ్యులతో కలిసి ఆయన డిప్యూటీ సీఎంను ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఉత్సవాలకు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరు కావాలని డిప్యూటీ సీఎంను వారు కోరారు.