Car Accident : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బైపాస్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ కారు బావిలోకి దూసుకెళ్లింది. ఈ కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. టేకుల పల్లి నుంచి అన్నారం వెళ్తోన్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారును జేసీబీ సహాయంతో పోలీసులు బయటకి తీశారు. అటుగా వెళ్తోన్న విద్యార్థులు సిద్ధూ, రంజిత్ బావిలో పడ్డ కారు అద్దాలు పగులగొట్టి ముగ్గురిని రక్షించారు.  


అసలేం జరిగింది? 


మహబూబాబాద్ జిల్లాలో దుర్ఘటన జరిగింది. ప్రమాదవశాత్తూ ఓ కారు బావిలో పడింది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురిని స్థానికులు రక్షించారు. కేసముద్రం శివారులోని బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది.  బాధితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన వారుగా తెలుస్తోంది. పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. లిఫ్ట్ అడిగితే ఇచ్చామని ప్రమాదం నుంచి బయటపడిన వారు అంటున్నారు. ఘటనాస్థలిలో చీకటిగా ఉండడంతో సహాయచర్యలకు ఆటంకం కలుగుతోందని పోలీసులు తెలిపారు. 


నలుగురు మృతి 


ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో సుమలత, భద్రు, బిక్కు,దీక్షిత, అచ్చాలి, మరో ఇద్దరు ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ఘటనాస్థలిలో మృతి చెందారు. మరో ఇద్దరు కారుతో పాటు మునిగిపోయారు. ప్రమాదస్థలికి చేరుకున్న కేసముద్రం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కారును బయటకు తీసే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందో పోలీసులు ఆరా తీస్తున్నారు.  రహదారుల పక్కన హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.