Amaravati Padayatra : అమరావతి రైతుల మహా పాదయాత్రపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. పాదయాత్రలో 600 మందే పాల్గొంటామని అమరావతి రైతులు కోర్టుకు తెలిపారు. మధ్యలో ఎవరైనా తప్పుకుంటే ఇతరులను అనుమతించాలని కోరారు. మధ్యలో వచ్చే వారి వివరాలను పోలీసులకు అందిస్తామని రైతులు కోర్టును కోరారు.  సంఘీభావం తెలిపేవారు పాదయాత్రకు ముందు, వెనుక ఉండేలా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.  హైకోర్టు నిబంధనలను రైతులు పాటించడం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. 


తీర్పు రిజర్వ్ 


అమరావతి రైతుల పాదయాత్ర పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. అమరావతి రైతుల తరపున లాయర్లు పోసాని వెంకటేశ్వర్లు, ఉన్నం మురళీధర్ కోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని రైతుల తరఫు లాయర్లు కోరారు. పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొంటారని తెలిపారు. రైతులకు సంఘీభావం తెలిపేవారు పాదయాత్ర ముందు, వెనకా నడిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. రైతుల పాదయాత్రను అడ్డుకుంటాని వైసీపీ నేతలు, మంత్రులు బహిరంగంగా చెప్తున్న కారణంగా వారి నుంచి రక్షణ కల్పించాలని కోర్టుకు అభ్యర్థించారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ,  మంత్రులు ధర్మాన, అమర్నాథ్‌ తరపున మరికొందరు లాయర్ల వాదనలు వినిపించారు. రైతుల పిటిషన్లకు విచారణ అర్హత లేదని ఏజీ, లాయర్లు వాదించారు. పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరారు.  ఇరుపక్షాల వీడియో టేప్‌లను పరిశీలిస్తామని న్యాయమూర్తి అన్నారు. 


పాదయాత్రకు బ్రేక్ 


అమరావతి రైతులు తాము చేస్తున్న పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. పోలీసులు విధిస్తున్న ఆంక్షలతో విసిగిపోయామని కోర్టు నుంచి మళ్లీ ఆదేశాలు తీసుకొచ్చి పాదయాత్ర పునఃప్రారంభిస్తామంటున్నారు. నాలుగు రోజుల  పాటు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చినట్టు తెలిపారు. అమరావతి రైతులు అరసవల్లి వరకు చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చేరుకుంది.  పోలీసులు పాదయాత్రను చుట్టు ముట్టి అనేక ఆంక్షలు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మద్దతు తెలిపేవారిని రానివ్వకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారి ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సాకుగా చూపించి 600 మంది గుర్తింపు కార్డులు అడుగుతున్నారని అన్నారు. అనుమతి ఉన్న వాహనాలను తప్ప వేరే వాహనాలను అంగీకరించబోమంటున్నారని వివరించారు.  


గత విచారణలో హైకోర్టు  


అమరావతి రైతుల పాదయాత్రలో పెద్ద ఎత్తున మద్దతుదారులు పాల్గొనవద్దని ఇటీవల విచారణలో హైకోర్టు స్పష్టం చేసింది. మద్దతుదారులు రోడ్డుకు ఇరవైపులా నిలబడి మద్దతు తెలియచేయవచ్చునని.. కానీ పాదయాత్రలో పాల్గొనవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని మద్దతు ఇచ్చేవాళ్లు పాదయాత్రలో కలిసి నడవకుండా చూసే బాధ్యత పోలీస్ అధికారులదేనని తెలిపింది. పాదయాత్రలో కేవలం నాలుగు వాహనాలు మాత్రమే వాడాలని హైకోర్టు స్పష్టం చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకునే హక్కు పోలీసులకు ఉందని కూడా హైకోర్టు తెలిపింది.  నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని హైకోర్టు తేల్చిచెప్పింది.